Anaparthy Assembly Constituency: హీటు పెంచుతున్న అనపర్తి- మార్పు ఖాయమంటు ప్రచారం- మరో రెండు సీట్లపై కూడా ఎఫెక్ట్!
East Godavari News: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానంపై సందిగ్ధత వీడడంలేదు. పొత్తులో భాగంగా బీజేపీకు కేటాయించిన అనపర్తి సీటు మార్పు అనివార్యం అన్న మాటలు వినిపిస్తున్నాయి.
Andhra Pradesh News: ఏపీలో ఎన్నికల వేళ ఇంకా సీట్లు పంచాయితీ తేలడంలేదు. ఇప్పటికే వైసీపీ రాష్ట్రంలోని అన్ని సీట్లు పూర్తిస్థాయిలో ఖరారు చేసిన పరిస్థితి ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల పంచాయితీ తేలడంలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానంపై సందిగ్ధత వీడడంలేదు. ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీకు కేటాయించిన అనపర్తి సీటు మార్పు అనివార్యం అన్న మాటలు వినిపిస్తున్నాయి.
అనపర్తి మార్పు దాదాపు ఖాయం.
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అనపర్తి అసెంబ్లీ నియోజవర్గంలో ముందు నుంచి కూటమి తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే సీటు దక్కుతుందని అంతా భావించారు. ఆయన ముందు నుంచి పూర్తి సన్నద్ధతతో ఉన్నారు కూడా. టీడీపీ తొలిజాబితాలో అనపర్తి నియోజకవర్గం నుంచి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. అయితే ఆ తరువాత ఏర్పడిన బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి సీట్లు కేటాయింపులో మార్పులు తలెత్తాయి.
అనపర్తి నియోజకవర్గంలో అనూహ్యంగా బీజేపీకు కేటాయించారు. బీజేపీ నుంచి మాజీ సైనికుడు ఎం.శివకృష్ణంరాజుకు అవకాశం కల్పించింది. దీంతో అనపర్తి నియోజకవర్గం ఒక్కసారిగా భగ్గుమంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, జనసైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనబాట పట్టారు. నెగ్గే సీటును ఎందుకు పాడు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలు రోజుల తరబడి జరగడంతో కూటమి మనసు మార్చుకునే పనిలో పడిందట.
నల్లమల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్ధిత్వాన్ని పునపరిశీలన చేసి అనపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలో దింపేందుకు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఇప్పటికే రామకృష్ణారెడ్డి అవసరమైతే ఇండిపెండెంట్‌గా రంగంలో దిగేందుకు నియోజకవర్గం అంతా పాదయాత్ర చేపట్టగా ప్రజల నుంచి మంచి స్సందన వస్తుండడంతో అధిష్టానం మనసు మార్చుకుందని తెలుస్తోంది..
అనపర్తి సీటు ప్రభావం కోనసీమ జిల్లాపై..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరేచోట బీజేపీ పెద్దగా ఆసక్తి కనపరచకపోగా జిల్లా బీజేపీ నాయకులు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం(ఎస్సీ) నియోజకవర్గంపైనే దృష్టిసారించాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఓసారి బీజేపీ గెలుపొందింది. పార్టీ సీనియర్ నాయకుడు అయ్యాజీవేమా ఇక్కడి నుంచి బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కూటమి పెద్దలకు బీజేపీ నాయకులు ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గడ్డి సత్యనారాయణ అనే అభ్యర్ధిని ప్రకటించింది. ఆయన ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఆయన్ని కదపడం సరైంది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పి.గన్నవరం సీటు విషయంలో సందిగ్ధత నెలకొనగా అమలాపురం కూడా పరిశీలిస్తోందని మరో వాదన వినిస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి కూటమి అభ్యర్ధిగా అయితాబత్తుల ఆనందరావును పోటీలో పెట్టింది. బీజేపీకు కేటాయించిన సీట్లకు సంబందించి అనపర్తి గనుక మార్చితే ఆ ప్రభావం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాలపై పడే పరిస్థితి ఉందని చర్చ జరుగుతోంది. మొత్తం మీద అనపర్తి అభ్యర్థిని మారిస్తే ఆ ప్రభావం పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాలపై పడుతుందని, అది వైసీపీకు కలిసొచ్చే అంశమని పలువురు చెప్పుకుంటున్నారు.