Hyderabad ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు, ఇక మీ ఆటలు సాగవు - ఒవైసీపై మాధవీలత కీలక వ్యాఖ్యలు
Hyderabad Lok sabha Elections 2024: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
BJP MP Candidate Madhavilatha's Key Comments On Asaduddin Owaisi: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఐఎస్ సదన్ (సంతోష్ నగర్) డివిజనల్‌లో ఆదివారం (ఏప్రిల్ 21న) ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. పాత బస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్ చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వని స్పష్టం చేశారు.
ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శలు
మైనార్టీలకు ఒవైసీ ఏమీ చేయలేదన్న ఆమె.. కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈసారి హైదరాబాద్ ఎంఐఎం కోటను బీజేపీ కైవసం చేసుకుంటుందని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. పాతబస్తీలో బీజేపీ గెలిస్తే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఒవైసీ సోదరులకు ఇక్కడి ప్రజల అభివృద్ధి కంటే.. వారి వ్యక్తిగత అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జోరు పెంచింది. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే మాధవీలత జోరుగా ప్రచారాన్ని సాగిస్తూ ఒవైసీ లక్ష్యంగా మాటలు తూటాలు పేలుస్తున్నారు. మరోవైపు ఒవైసీ కూడా మాధవీలత వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. దీంతో రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో జరుగుతున్న ఎన్నికలు మరింత హీట్ పెంచుతున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆదివారం చేసిన ప్రచారంలో కార్పొరేటర్ జంగం శ్వేతామధుకర్ రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి వీరేందర్ యాదవ్‌తోపాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో ఇబ్బందులు
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆదివారం పర్యటనలో ఆమె సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వినయ్ నగర్ విజయ వినాయక ఆలయంలో ఎంపీ అభ్యర్థి మాధవీ లత ప్రత్యేక పూజలు నిర్వహించే సమయంలో కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డిని సక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకులు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాధవీలత జోక్యం చేసుకుని సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.