Siddham Meeting : నాలుగో సిద్ధం సభకు వైసీపీ భారీ ఏర్పాట్లు- 200 ఎకరాల్లో నిర్వాహణ
YSRCP News: వైసీపీ నిర్వహిస్తున్న నాలుగో సిద్ధం సభకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగో సిద్ధం సభను 200 ఎకరాల్లో నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh News : వైసీపీ నిర్వహిస్తున్న నాలుగో సిద్ధం సభకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన మూడు సిద్ధం సభలకు భారీగా పార్టీ నాయకులు హాజరయ్యారు. నాలుగో సిద్ధం సభను అంతకుమించి నిర్వహించాలన్న ఉద్ధేశంతో ఉన్న వైసీపీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి గుడిపాడులో నాలుగో సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం సాగుతున్నాయి. ఎన్ని లక్షలు మంది వచ్చినా ఇబ్బందుల్లేకుండా ఉండేలా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలంలో సీఎం ప్రసంగం ప్రతి ఒక్కరికీ కనిపించేలా భారీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రజలకు చేరువగా వెళ్లి మాట్లాడి వచ్చేందుకు అనుగుణంగా భారీ ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సభ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, అధికారులు, నాయకులు ఏర్పాట్లును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ ప్రోగ్రామ్ కన్వీనర్ తలసిల రఘురామ్ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
200 ఎకరాల్లో సిద్ధం సభ
నాలుగో సిద్ధం సభను 200 ఎకరాల్లో నిర్వహిస్తున్నారు. అవసరం అయితే మరో 200 ఎకరాలను సిద్ధం చేస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సుమారు 15 లక్షల మందికి సభకు హాజరవుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే వాహనాలు కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సిద్ధం సభ నేపథ్యంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
కీలక ప్రకటనలు ఉండేనా
వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు చివరివి కావడంతో ఆ పార్టీతోపాటు రాష్ట్ర ప్రజలు ఈ సభను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఈ సభలో సీఎం కీలక ప్రసంగంతోపాటు ఎన్నికలకు సంబంధించిన హామీలను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, పింఛన్లు పెంపు, విద్యార్థినులకు స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి అందించేందుకు అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టో రెడీ చేసిదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రీతిలో హామీలు లేకపోయనా.. కొన్ని కీలక హామీలు అయితే సీఎం జగన్ సభా వేదికగా ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. కొందరు పార్టీ నేతలు మేనిఫెస్టోను ఇక్కడే విడుదల చేస్తారని చెబుతున్నారు. మరి సీఎం జగన్ ఆ దిశగా మేనిఫెస్టో విడుదల చేస్తారా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ సభ తరువాత పూర్తిస్థాయిలో వైసీపీ జాబితాను విడుదల చేయడంపైనా వైసీపీ దృష్టి సారించింది. ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికలకు సంసిద్ధతను తెలియజేసే ఉద్ధేశంతో వైసీపీ ఉంది. ఈ మేరకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.