(Source: Poll of Polls)
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్ చిత్రం- ఒకే స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ
Elections 2024: ఏ చిన్నపాటి శత్రుత్వం ఉన్నా.. రాజకీయంగా చూసుకునే రోజులు పెరిగిపోయాయి. పశ్చిమ బెంగాల్‌లో మాజీ భార్య, మాజీ భర్త.. ఒకేలోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కసి తీర్చుకుంటున్నారు.
West Bengal Elections 2024: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. కానీ, దీనికి భిన్నంగా మాజీ భార్యాభర్తలు.. పశ్చిమ బెంగాల్(West bengal)లో పరస్పరం తలపడుతున్నారు. ఒకే లోక్‌సభ స్థానం(Loksabha seat) నుంచి ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి తలపడుతూ.. ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. సహజంగా ఇలాంటివి వ్యూహాత్మక ఎత్తుగడలలో భాగంగా చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానం నుంచి తెలుగు దేశం పార్టీ(TDP) తరఫున కిశోర్ చంద్రదేవ్ పోటీ చేస్తే.. ఇదే స్థానం నుంచి ఆయన కుమార్తె వైరిచర్ల శ్రుతి కాంగ్రెస్ పార్టీ(Congress party) నుంచి పోటీ చేశారు. ఇక్కడ వ్యూహం ఏంటంటే.. తెలుగు దేశం పార్టీ వ్యతిరేక ఓటును మరింత చీల్చి కిశోర్‌కు మేలు చేయడమే. అయితే.. ఈవ్యూహం బెడిసి కొట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంది. కానీ, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మాజీ భార్య,మాజీ భర్త ఇద్దరూ పరస్పరం రాజకీయంగా తేల్చుకునే పనిలో భాగంగా చెరో పార్టీలో చేరి ఒకే స్థానం నుంచి టికెట్ దక్కించుకున్నారు. వీరి వచ్చే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు తలపడనున్నారు. మరి ఈ కథేంటో చూద్దామా?
అసలేం జరిగింది?
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బంగాల్లోని బంకురా(Bankura) జిల్లాలో ఉన్న బిష్ణుపుర్ లోక్‌సభ స్థానం ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు ఒకరిపై ఒకరు పోటీచేయనున్నారు. ఒకరు తృణమూల్ కాంగ్రెస్(TMC) నుంచి పోటీ చేస్తుండగా, మరొకరు బీజేపీ(BJP) నుంచి బరిలో దిగుతున్నారు. నిజానికి ఇప్పటి వరకు అన్నదమ్ములు పోటీ చేసిన సందర్భం, తండ్రి, కూతురు పోటీ చేసిన వ్యవహారం ఉంది కానీ, ఇలా.. మాజీ భార్యాభర్తలు పోటీచేయడం.. అది కూడా వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు పైచేయిసాధించాలన్న కసితో పోటీ చేయడం ఇదే తొలిసారి. అంటే ఒక విధమైన 'ప్రతీకార' రాజకీయాలు జరుగుతున్నాయన్నమాట.
ఎవరు వీరు?
సౌమిత్ర ఖాన్(Soumitra khan), సుజాతా మండల్(Sujata mandal) ఇద్దరూ భార్యాభర్తలు. అయితే ఇది 2021కి ముందు. ఆ తర్వాత వీరిద్దరూ అనూహ్యంగా విడిపోయారు. అది కూడా రాజకీయ కారణాలతోనే. అసలు సౌమిత్ర ఖాన్, సుజాతలు 2010లో ప్రేమలో పడ్డారు. సుజాత ఓ స్కూల్ టీచర్. ఆ సమయానికే సౌమిత్ర తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఓ సందర్భంలో సుజాత ఓ పనిపై ఆయన దగ్గరకు వెళ్లారు. ఇలా .. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. వెంటనే ఇంట్లో పెద్దలతో కూడా మాట్లాడి వివాహం చేసుకున్నారు. సుమారు పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగిపోయింది. అయితే, 2019 ఎన్నికల సమయానికి సౌమిత్రఖాన్‌ను బీజేపీ తనవైపు తిప్పుకొంది. దీంతో ఆయన ఆ పార్లమెంటు ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను విడిచి పెట్టి బీజేపీ బాట పట్టారు. దీంతో ఆయన భార్య సుజాత కూడా ఆయన వెంటే బీజేపీలో నడిచారు. ఆయనకు ప్రచారం చేసిపెట్టారు.
కథ అడ్డం తిరిగింది ఇలా..
బెంగాల్‌లో ఎదుగుతున్న బీజేపీకి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న తృణమూల్ కాంగ్రెస్.. బీజేపీ ఎంపీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే సౌమిత్ర సతీమణి.. సుజాతను సీఎం మమతా బెనర్జీ ప్రత్యేకంగా తనతో కలిసేలా ఒక భేటీ ఏర్పాటు చేసుకుని.. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ తీర్థం ఇచ్చేశారు. ఆమె కూడా.. ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండానే పార్టీలో చేరిపోయారు. ఇదే.. సౌమిత్ర, సుజాతల వైవాహిక బంధంలో చిచ్చు పెట్టింది. బీజేపీ ఎంపీగా ఉన్న సౌమిత్ర, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే టీఎంసీలో ఉన్న సుజాతల మధ్య తీవ్ర వివాదాలు రాజుకున్నాయి. నువ్వు పార్టీ వదిలేయాలని సౌమిత్ర అంటే..కాదు .. నువ్వే బీజేపీని వీడి తృణమూల్ జెండా మోయాలని సుజాతలు కీచులాడుకున్నారు. ఇది తీవ్ర వివాదాలకు దారితీసి.. మీడియా సమక్షంలోనే ఇద్దరూ పరస్పర విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో సుజాతకు మమత టికెట్ ఇచ్చారు. ఆమె విజయం కూడా సాధించారు. అప్పటి నుంచి సీఎం మమతకు అత్యంత ఆప్తురాలిగా కూడా వ్యవహరించారు. ఇక, సుజాత-సౌమిత్రలు విడాకులు తీసుకుని వేర్వేరు జీవితాలు గడుపుతున్నారు.
ఎన్నికల్లో ఈ మాజీ భార్యభర్తలు పోటీ
బంకురా జిల్లాలోని బిష్ణుపుర్ లోక్‌సభ స్థానం నుంచి సౌమిత్ర ఖాన్‌కు బీజేపీ టికెట్ ఇవ్వగా... టీఎంసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఈ స్థానాన్ని సౌమిత్ర ఖాన్ మాజీ భార్య సూజాత మండల్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుజాత మండల్ టీఎంసీ లోక్‌సభ బరిలో దింపింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ మాజీ భార్యభర్తల పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ``కాపురం సజావుగా చేయడం తెలియని వ్యక్తి ప్రజలకు సేవ ఎలా చేస్తుంది`` అంటూ మాజీ భర్త సౌమిత్ర చేసిన వ్యాఖ్యలకు సుజాత భారీ కౌంటర్ ఇచ్చారు. ``కాపురం చేయాలనే ఆలోచన లేని వ్యక్తితో 10 ఏళ్లు భారత నారిగా కాపురం చేశా``అని వ్యాఖ్యానించారు. ఇలా.. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలతో వేడెక్కించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఈ ఒక్క స్థానంపై నే పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొందంటే.. ఈ మాజీ ప్రేయసీప్రియులు, భార్యాభర్తల రాజకీయ జోరు ఎలా ఉందో అర్థమవుతుంది.
42 మంది అభ్యర్థులతో జాబితా
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. వారిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, మాజీ ఎంపీ మహువా మొయిత్రా పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా, 16 మంది సిటింగ్‌లకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. బహ్‌రమ్‌పుర్ నుంచి యూసుఫ్ పఠాన్, మహువా మొయిత్రా మరోసారి కృష్ణానగర్ నుంచి తలపడనున్నారు.