Ap Elections: ఓటింగ్ కు అంతా సిద్ధం - సీఎం జగన్, చంద్రబాబు, పవన్ ఎక్కడ ఓటేస్తారంటే?
Andhra Pradesh News: ఏపీలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Political Leaders Will Casting Their Votes In These Places: ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా జనం సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. అటు, రాజకీయ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ (Cm Jagan) - పులివెందుల (Pulivendula), టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) - ఉండవల్లి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - మంగళగిరి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ - మంగళగిరి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి - రాజమండ్రి పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. అటు, ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కల్పిస్తోంది. ఏపీలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది.
పులివెందులకు సీఎం జగన్ దంపతులు
మరోవైపు, ఏపీ సీఎం జగన్ ఆదివారం పులివెందులకు వెళ్లనున్నారు. సోమవారం జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లనున్నారు. సాయత్రం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలింగ్ జరిగేందుకు ముందు సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన వారు ఉండేందుకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఆది, సోమవారాల్లో ఆయన పులివెందులలోనే ఉంటారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కూడా పులివెందుల వెళ్లనున్నారు. రాత్రి పులివెందులలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు. మరోవైపు, సీఎం పులివెందులకు వస్తుండడంతో జిల్లా ఎస్పీ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. అటు, వర్షం కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికల సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈవీఎంలు తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో భద్రపరుస్తున్నారు.
14న వారణాసికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలో సోమవారం తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం ఆయన మే 14న వారణాసి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందగా.. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి వారణాసికి వెళ్లనున్నారు. అదే రోజు వారణాసిలోని ఎన్డీఏ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు. అటు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయన పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో నిలవగా ఓటు హక్కు మాత్రం మంగళగిరిలో ఉంది. అయితే, చివరి నిమిషంలో పిఠాపురం నుంచి పవన్ పోటీ ఖరారైందని.. అందుకే పిఠాపురానికి ఓటు ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.