Vijayawada News: ఓటు వేసేందుకు ఊరెళ్తున్నాం - బస్సులు లేక అవస్థల ప్రయాణం, ప్రత్యేక సర్వీసుల కోసం వినతి
Andhrapradesh News: ఎన్నికల వేళ విజయవాడ నుంచి బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Rush In Vijayawada Bus Stand: ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వగ్రామాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ (Vijayawada) బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇప్పటికే రిజర్వేషన్లన్నీ ఫుల్ కాగా.. ప్రత్యేక బస్సులు కూడా నిండిపోతున్నాయి. అయితే, ఉదయం 5 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్సూ రావడం లేదని.. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, రిజర్వేషన్ కేంద్రాల వద్ద కూడా జనం భారీ క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
హైవేపై భారీగా రద్దీ
అటు, ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద భారీగా రద్దీ నెలకొనగా.. ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ లో స్ధిరపడ్డ వారు తమ సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రావడంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం నెలకొంది. హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకూ ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
విజయవాడకు ప్రత్యేక బస్సులు
కాగా, టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఏపీకి ఓటు వేసేందుకు వెళ్లే వారి కోసం 2 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయితే, అవి ముందుగానే రిజర్వేషన్లు పూర్తి కాగా అన్ని స్టేషన్లలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్ టూ విజయవాడ రూట్ లో మరో 140 బస్సులను నడుపుతున్నట్లుగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్సుల్లో మొత్తం 3 వేల దాకా సీట్లు ఉన్నాయని.. ప్రయాణీకులు https://tsrtconline.in నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపారు. అలాగే, హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. 'జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది' అని సజ్జనార్ పోస్ట్ చేశారు.
విశాఖకు ప్రత్యేక రైళ్లు
అటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ (రైలు నెం. 07097) నుంచి రాత్రి 7:45 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 6:30 గంటలకు విశాఖ చేరకుంటుంది. అలాగే, సోమవారం రాత్రి 7:50 గంటలకు విశాఖ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు (రైలు నెం. 07098) మంగళవారం ఉదయం 8:15 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. మరోవైపు, రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనంగా ఒక్కో బోగీని జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
#SpecialTrains between Secunderabad and Visakhapatnam pic.twitter.com/4jW2irUEMY
— South Central Railway (@SCRailwayIndia) May 11, 2024
Also Read: AP News: ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సీఈఓ గుడ్‌న్యూస్ - 14న స్పెషల్ క్యాజువల్ లీవ్