Land Tittiling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రచారం - చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు, టీడీపీ ఇంఛార్జీకి సీఐడీ నోటీసులు
Andhrapradesh News: రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Cid FIR on Chandrababu And Lokesh: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titiling Act) అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు తీవ్రం చేస్తుండగా.. సీఎం జగన్ (Cm Jagan) సహా వైసీపీ నేతలు సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. అయితే, ఆదివారం ఈ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబును ఏ1గా, లోకేశ్ ను ఏ2గా పేర్కొంది. ఈ వ్యవహారంలో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీపైనా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
టీడీపీ ఇంఛార్జీకి నోటీసులు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంపై ఈసీ ఆదేశాలతో విచారణ వేగవంతం చేసిన సీఐడీ టీడీపీ ఇంఛార్జీ అశోక్ బాబుకు నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు.
ఇదీ జరిగింది
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములన్నీ వైసీపీ నేతల గుప్పిట్లోకి వెళ్లిపోతాయని.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని.. మార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం వైఎస్ జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై విచారణ చేయాలని సీఐడీని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తెచ్చిన చట్టాలపై దుష్ప్రచారం చేయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ.. చంద్రబాబు, లోకేశ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తోన్న ప్రచారంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. 'ఇంకా 13వేల గ్రామాలలో సర్వే చేయాల్సి ఉంది. చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం రైతులకు డబ్బులు ఇచ్చి సీఎం జగన్ భూములు తీసుకున్నారు. అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నారు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా.?. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.' అని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Amit Shah: అందుకే మేం టీడీపీ, జనసేనతో కలిశాం, స్పష్టత ఇచ్చిన అమిత్ షా - పోలవరంపై కీలక ప్రకటన