(Source: Poll of Polls)
KCR Bus Yatra: గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర రీషెడ్యూల్ - పూర్తి వివరాలివే
Telangana News: గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధం శుక్రవారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో ఆయన బస్సు యాత్ర యథావిధిగా కొనసాగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రీషెడ్యూల్ చేశాయి.
KCR Bus Yatra Re Schedule: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం 8 గంటలకు ఈసీ విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో గులాబీ బాస్ బస్సు యాత్రను బీఆర్ఎస్ శ్రేణులు రీషెడ్యూల్ చేశాయి. ఈ నెల 3వ తేదీన (శుక్రవారం) సాయంత్రం 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో ముందు ప్రకటించిన విధంగానే యథావిధిగా కొనసాగనుంది.
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే
- ఈ నెల 3వ తేదీన (శుక్రవారం) సాయంత్రం 8 గంటల తర్వాత కేసీఆర్.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అక్కడే బస చేయనున్నారు.
- ఈ నెల 4వ తేదీన (శనివారం) సాయంత్రం మంచిర్యాలలో రోడ్ షో, 5వ తేదీన సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో నిర్వహిస్తారు.
- 6వ తేదీన సాయంత్రం నిజామాబాద్ రోడ్ షో, 7వ తేదీన కామారెడ్డి రోడ్ షో.. అనంతరం మెదక్ లో రోడ్ షోలో పాల్గొంటారు.
- ఈ నెల 8వ తేదీన నర్సాపూర్ అనంతరం పటాన్ చెరులో రోడ్ షో నిర్వహిస్తారు.
- ఈ నెల 9న సాయంత్రం కరీంనగర్ లో గులాబీ బాస్ బస్సుయాత్ర, సాయంత్రం రోడ్ షో ఉంటుంది.
- 10వ తేదీన చివరి రోజు సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్ధిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది.
ఇదీ జరిగింది
కాగా, సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 5న కేసీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో పాటు, తమ పార్టీ నేతలను ఉద్దేశించి అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అది ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ.. కేసీఆర్ నుంచి సైతం వివరణ సేకరించింది. తెలంగాణ మాండలికాన్ని స్థానిక అధికారులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ఈసీ.. గులాబీ బాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని భావించి చర్యలు తీసుకుంది. బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడొద్దని సూచించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని స్పష్టం చేసింది. మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా ఈసీ అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకుని నోటీసులు అందించగా.. ఈసీ సూచన మేరకు బుధవారం రాత్రి 8 గంటల ముందుగానే కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈసీ గడువు ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం 8 గంటల తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగించనున్నారు.
Also Read: KTR On EC : మోదీ కనుసన్నల్లోనే ఈసీ - ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు - కేటీఆర్ విమర్శలు