Yemmiganur Assembly Constituency: ఎమ్మిగనూరు అభ్యర్థికి దూరంగా ఉంటున్న బీజేపీ జనసేన!
Kurnool District News: ఎమ్మిగనూరులో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ఏర్పడే వరకు టికెట్ కోసం ప్రయత్నించిన పార్టీ ఇప్పుడు ఖరారు చేసిన అభ్యర్థికి సహకరించడం లేదు. ఇందుకు కారణమేంటంటే?
Andhra Pradesh News: రాష్ట్రంలో వైయస్సార్సీపీ(YSRCP) పాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో జగన్‌ని గద్దె దింపాలన ఏకైక లక్ష్యంతో మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ నియోజకవర్గంలో మాత్రం మూడు పార్టీల అభ్యర్థులు ఒకరికి ఒకరు సహకరించకపోవడం ఆసక్తిగా మారింది. ఎన్ని సమస్యలు ఉన్న అధికారం చేపట్టాక వాటిని పరిష్కరించుకుందాం అని కూటమి అధినేతలు ఆలోచనలో ఉంటే వారి పార్టీ నేతలు మాత్రం మా పంత మాదే అంటూ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా ఉంటున్నారు
టికెట్ కోసం మూడు పార్టీలు పోటాపోటీ
మూడు పార్టీల కూటమి ఏర్పడిన అనంతరం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని మూడు పార్టీల ఇన్చార్జిలు తమ నేతలతో చెప్పుకొచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బిజెపి ఇన్చార్జిగా మురారి రెడ్డి, జనసేన ఇన్చార్జిగా రేఖ గౌడ్, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పివి జయ నాగేశ్వర్రెడ్డి కొనసాగుతున్నారు. అయితే కూటమి అభ్యర్థిగా టిడిపి నేత బివి జయ నాగేశ్వర రెడ్డిని ప్రకటించారు.
జయనాగేశ్వర్ రెడ్డి వైఖరితో చేటు
టికెట్ దక్కించుకున్న జయనాగేశ్వర్ రెడ్డి బీజేపీ, జనసేన నేతలను కలుపుకొని వెళ్లడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఆయనతో పని చేసేందుకు ఆ పార్టీ నేతలు సముఖంగా లేరనే చర్చ నడుస్తోంది. ఈ మధ్య జరిగిన ప్రజాగళం విషయంలో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ప్రజా గళం సభకు జనసేన, బిజెపి నాయకులు దూరంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయ నాగేశ్వర్ రెడ్డి ప్రవర్తనే కారణంగా నేతలు చెబుతున్నారు. ఆయన వైఖరితోనే జన సేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రజా గళానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.
ప్రచారానికి దూరంగా బీజేపీ, జనసేన
ఎలాగైనా 2024 ఎన్నికల్లో వైసార్సీపీని ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో జనసేన, బిజెపితో పొత్తు ఏర్పడింది. ఇది క్షేత్రస్థాయిలో నేతల తీరుతో అధినేత లక్ష్యానికి తూట్లు పొడిచేలా కనిపిస్తోంది. వర్గ విభేదాలతో కూటమి పార్టీలకు నష్టం చేకూర్చే ఉందనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బివి జయ నాగేశ్వర్‌రెడ్డి బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడం లేదట. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారానికి కూడా పిలవడం లేదని టాక్. వారి పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. అందుకే టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీజేపీ, జనసేన నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అధినాయకత్వం కలుగుజేసుకోవాలని సూచన
దీనిపై సొంత పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాలతో సఖ్యతగా లేకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే అంటున్నారు. ఈ విభేదాలు వైసీపీకి లాభిస్తాయని భయపడుతున్నారు. వీరి మధ్య సమన్వయం కుదిర్చిలా అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు నాయకులు ఫిర్యాదుల చేసినట్టు చెప్పుకుంటున్నారు.