AP Elections 2024: 'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
Andhra Pradesh News: రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
Ap CEO Mukesh Kumar Meena Comments On Election Arrangements: ఏపీలో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆదివారం పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ఈవీఎంలు, ఇతర సామగ్రి పంపిణీ చేశామని.. రాత్రి 7 గంటల కల్లా సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్ర పోలీసులతో పాటు తమిళనాడు, కర్ణాటక సహా కేంద్ర బలగాలను సైతం వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. అంతా ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
'అలా చేస్తే చర్యలు'
పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీనిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. 'పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశాం. ఓటింగ్ శాతాన్ని అంచనా వేసేలా ప్రత్యేక యాప్స్ తీసుకొచ్చాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు. సీవిజిల్ లో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ప్రలోభాలకు అడ్డుకట్ట వేశాం. అర్బన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా చర్యలు చేపట్టాం. వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేస్తున్నాం. జీరో వయలెన్స్, నో రీపోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నాం. 74 శాతం మేరకు పోలింగ్ స్టేషన్లలో వెబ్ కామ్స్ పెట్టాం. పోలింగ్ కేంద్రాల లోపల, వెలుపల వెబ్ కామ్స్ అమర్చాం. పోల్ డేటా మానిటరింగ్ సిస్టం యాప్ ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం.' అని వెల్లడించారు.
దుష్ప్రచారంపై ఆగ్రహం
మరోవైపు, ఓటింగ్ లో ఉపయోగించే సిరాపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు తాము ఓటు వేశామని చూపుడు వేలు చూపిస్తూ ఉండడం ఈ మధ్య ట్రెండింగ్ గా ఉంది. అయితే, ఎన్నికల సిబ్బంది వాడే ఈ ఇంకు చాలా ప్రత్యేకమైనది. ఒక్కసారి ఆ సిరాను చూపుడు వేలుపై రాస్తే అది అస్సలు చెరిగిపోకుండా ఉంటుంది. కాగా, చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని.. మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.