Nandyal Police: నంద్యాల ఎస్పీపై చర్యలకు సీఈసీ ఆదేశం - ఎన్నికల కోడ్ అమల్లో విఫలమయ్యారని ఆగ్రహం, డీజీపీకి కీలక ఉత్తర్వులు
Ap Elections 2024: నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. శనివారం అల్లు అర్జున్ పర్యటన సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో విఫలమయ్యారని ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని చెప్పింది.
CEC Anger On Nandyal Police: నంద్యాల (Nandyal) పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎస్పీ రఘువీరారెడ్డిపై (Raghuveera Reddy) చర్యలకు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యారని.. ఆయనపై ఛార్జెస్ ఫైల్ చేయాలని తెలిపింది. ఎస్పీతో పాటు ఎస్ డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం రాత్రి 7 గంటల్లోపు అందించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, నంద్యాలలో శనివారం సినీనటుడు అల్లు అర్జున్ పర్యటించారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలిరాగా.. వారికి అభివాదం చేస్తూ అల్లు అర్జున్ వారి ఇంటికి వచ్చారు. శిల్పా రవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయన పర్యటనకు ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై సీఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కేసును క్లోజ్ చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది.
అల్లు అర్జున్ పై కేసు నమోదు
అటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదైంది. అయితే, కాగా శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు బన్నీ శనివారం నంద్యాలలో పర్యటించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా జన సమీకరణ చేయడం వివాదానికి దారి తీసింది. సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో ర్యాలీలో వేలాది మందితో పాల్గొన్నందునే ఈ కేసు నమోదు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో Cr. No.71/2024.U/s 188IPC. కేసు రిజిస్టర్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీ చేసినందున అధికారుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది.
అయితే, వైసీపీ శ్రేణులు నంద్యాల శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి అల్లు అర్జున్ ను తీసుకువచ్చారు. ఆయన పర్యటనకు ఎలాంటి అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సైతం శనివారం నంద్యాలలో ఉంది. అంతేకాక, అదే సమయంలో హీరో అల్లు అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Ap Elections: ఓటింగ్ కు అంతా సిద్ధం - సీఎం జగన్, చంద్రబాబు, పవన్ ఎక్కడ ఓటేస్తారంటే?