Amit Shah: రిజర్వేషన్ల రద్దుపై తన మాటలు వక్రీకరణ, కాంగ్రెస్‌పై అమిత్ షా ఆగ్రహం
Union Home Minister Amit Shah: రిజర్వేషన్ల రద్దు అంశం కేంద్రంగా తనపై కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న దుష్ప్రచారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Union Home Minister Amit Shah Comments: దేశంలో రాజ్యాంగ బద్ధంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు రద్దు అంశంపై తన మాటలను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోపై అమిత్ షా తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తనపై ఉన్న అసహనంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. తాను ఆడిన మాటలను వక్రీకరించి దుష్ర్పాచారాన్ని కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు.
మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ వ్యతిరేకమని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. 400 సీట్లు దక్కించుకున్న తరువాత బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని అమిత్ షా ఆక్షేపించారు. ఆ మాటలన్నీ నిరాధారమైనవని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తమ పార్టీ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. తనతోపాటు మా పార్టీకి చెందిన ఇతర నేతల నకిలీ వీడియోలను ప్రచారం చేసే స్థాయికి వారి అసహం పెరిగిపోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నాయకులు ఈ ఫేక్ వీడియోను వ్యాప్తి చేశారని విమర్శించిన అమిత్ షా.. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత ఈ వ్యవహారంలో క్రిమినల్ నేరాన్ని ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు.
రాహుల్‌తో మరింత దిగజారిన రాజకీయాలు
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాజకీయాలు మరింత దిగజారాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఇప్పటికే అదే పనిలో ఆయన ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ తరహా దృశ్యాలను ప్రచారం చేసి, ప్రజల మద్ధతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రధాన పార్టీలు ఈ తరహా చర్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు.
వీడియో సోర్స్‌పై పోలీసులు దృష్టి
అమిత్ షా మాట్లాడినట్టు విడుదల చేసిన ఫేక్ వీడియో మూలాలను కనుగొనడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఎక్స్‌తోపాటు సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. మరోవైపు ఇదే కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. వాస్తవ వీడియోను మార్ఫింగ్ చేసి.. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కట్టుబడి ఉన్నామంటూ అమిత్ షా మాట్లాడినట్టు ఆ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు.