2025లో NCERT సిలబస్ లో భారీ మార్పులు.. మీరు ఈ విషయాలు తెలుసుకోండి
Year Ender 2025 | NCERT 2025 లో కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు కేవలం చదవడం మాత్రమే కాకుండా.. ఆలోచించేలా, అర్థం చేసుకునేలా నేర్చుకోవాలని ప్లాన్ చేసింది.

Year Ender 2025 | ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలో కొత్త విద్యా సంవత్సరం 2026 ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు NCERT ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లో చేసిన ప్రధాన మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి, కొత్త విద్యా విధానం (NEP 2020) అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశ విద్యా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు చదువు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. పిల్లలకు ఆచరణాత్మక జ్ఞానం, అభివృద్ధి, స్థానిక సంస్కృతి, చరిత్ర, ఉపాధికి సంబంధించిన విద్యను అందించడంపై దృష్టి సారిస్తున్నారు.
ఈ దిశలో, NCERT 2025 సంవత్సరంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు కేవలం బట్టి పట్టే చదువు కాకుండా ఆలోచించడం, అర్థం చేసుకోవడం, జీవితంలో ఉపయోగపడే విషయాలను నేర్చుకోవడమే NCERT ప్రధాన లక్ష్యం. ఈ కారణంగా, సిలబస్‌ను సులభతరం చేశారు. పాత అధ్యాయాలను తొలగించారు. అనేక కొత్త, ఆసక్తికరమైన, ఉపయోగకరమైన అంశాలను చేర్చారు. కాబట్టి 2025 సంవత్సరంలో NCERT సిలబస్‌లో చేసిన ప్రధాన మార్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
2025లో సిలబస్‌లో NCERT చేసిన ప్రధాన మార్పులు
NCERT 2025 ప్రారంభంలో చరిత్ర పుస్తకాలలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో ఢిల్లీ సుల్తానులు, మొఘలాయిలు కాలానికి సంబంధించిన అనేక అధ్యాయాలను తొలగించారు. వాటిని కుదించి కొత్త రూపాన్ని ఇచ్చారు. ఇప్పుడు చరిత్ర పుస్తకాలలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాచీన భారతదేశ చరిత్ర, గిరిజన, తెగ సమాజాల సహకారం, భారతీయ శాస్త్రవేత్తలు, వారి రచనలు, భారతీయ సంస్కృతి, నాగరికత వంటి వాటిపై దృష్టి సారించారు. చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి, చరిత్రలో చీకటి యుగం అని పిలువబడే ఒక కొత్త భాగాన్ని చేర్చారు. అలాగే విద్యా సంవత్సరం 2025-26 నుండి 4, 5, 7, 8 తరగతుల కొత్త పుస్తకాలు విడుదల చేశారు. ఈ పుస్తకాలలో భాషను మునుపటి కంటే సరళంగా, మరింత ఆసక్తికరంగా మార్చారు. పాత కంటెంట్‌ను కొత్త, ఆధునిక విషయాలతో భర్తీ చేశారు. అనేక పుస్తకాల పేర్లను కూడా మార్చడం తెలిసిందే.
నైపుణ్యం ఆధారిత విద్యపై దృష్టి
కొత్త విద్యా విధానం ప్రకారం, ఇప్పుడు 6వ తరగతి నుంచి స్కిల్స్ ఆధారిత అంటే వృత్తిపరమైన విద్యను ప్రారంభించనున్నారు. దీని అర్థం ఏమిటంటే, విద్యార్థులు కేవలం పుస్తకాలు మాత్రమే చదవడం కాదు, వారు పని చేయడం, ప్రాజెక్ట్‌లు తయారు చేయడం, నైపుణ్యాలను ఈ దశ నుంచే నేర్చుకుంటారు. చదువును ఉపాధి, జీవితానికి అనుసంధానం చేస్తారు. ఇది విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, పని చేసే అలవాటును పెంపొందించడం, భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
దీనితో పాటు వోకల్ ఫర్ లోకల్.. ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనను ప్రోత్సహించడానికి, NCERT పుస్తకాలలో స్వదేశీ మాడ్యూల్‌ను చేర్చింది. NCERT 3వ తరగతి నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం ఆపరేషన్ సిందూర్ పై 2 ప్రత్యేక మాడ్యూల్స్‌ను ప్రారంభించింది. కొత్త, పాత సిలబస్‌ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి, NCERT బ్రిడ్జ్ కోర్సులను సైతం ప్రారంభించింది. NCERT 4వ తరగతి, 5, 7, 8 తరగతుల పుస్తకాలను పూర్తిగా అప్‌డేట్ చేసింది.






















