CBSE Board Exam 2026: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! పరీక్షల విధానంలో సీబీఎస్ఈ భారీ మార్పులు
CBSE 10th Exam Pattern | సిబిఎస్ఈ 2026 పదో తరగతి పరీక్షల్లో సైన్స్, సోషల్ ప్రశ్నపత్రాలను విభజించింది. సమాధానాలు రాయడానికి విద్యార్థులకు కీలక సూచనలు చేసింది.

CBSE 10th Exams 2026 |సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026లో జరగనున్న 10వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి ఒక పెద్ద మార్పు చేసింది. ఈ విషయంలో అన్ని అనుబంధ పాఠశాలలకు సీబీఎస్‌ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేకంగా సైన్స్ (Science), సోషల్ (Social) పరీక్షలకు సంబంధించి మార్పు చేశారు. ఈ మార్పుల లక్ష్యం పరీక్ష ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడం. సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగే తప్పులను నివారించడం అని పేర్కొంది.
CBSE ప్రకారం, 10వ తరగతి సైన్స్ ప్రశ్న పత్రాన్ని ఇప్పుడు 3 స్పష్టమైన విభాగాలలో విభజిస్తారు. ఇందులో జీవశాస్త్రం, రసాయన శాస్త్రం , భౌతిక శాస్త్రాలకు వేర్వేరు విభాగాలు ఉంటాయి. అదేవిధంగా సోషల్ ప్రశ్నాపత్రం నాలుగు భాగాలుగా ఉంటుంది. ఇందులో చరిత్ర, భూగోళ శాస్త్రం, పాలిటీ, ఆర్థశాస్త్రాలను వేర్వేరు విభాగాలలో ఉంచుతారు. ఈ కొత్త విధానం 2026 బోర్డు పరీక్షల నుండి అమలులోకి వస్తుందని CBSE బోర్డు స్పష్టం చేసింది.
దాంతో ఏం జరుగుతుంది..
సమాధానాలు ఎలా రాయాలనే దానిపై విద్యార్థులకు సీబీఎస్ఈ ముఖ్యమైన సూచనలు చేసింది. విద్యార్థులు తమ సమాధాన పత్రాన్ని సైన్స్ కోసం 3 భాగాలుగా, సోషల్ సబ్జెక్ట్ కోసం నాలుగు భాగాలుగా విభజించాలి. ప్రతి విభాగంలోని సమాధానాలను ఆ విభాగం కోసం నిర్ణయించిన స్థలంలోనే రాయాలి. ఒక విద్యార్థి ఒక విభాగంలోని సమాధానాన్ని మరొక విభాగంలో రాసినా లేదా వేర్వేరు విభాగాల సమాధానాలను కలిపినా, అటువంటి సమాధానాలను మూల్యాంకనం చేయరని, వాటికి ఎటువంటి మార్కులు ఇవ్వరని CBSE తెలిపింది.
పరీక్షా ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా ధృవీకరణ లేదా పునఃమూల్యాంకనం సమయంలో కూడా ఇటువంటి తప్పులను అంగీకరించేదిలేదని CBSE సర్క్యులర్‌లో పేర్కొంది. అంటే సమాధానం తప్పు విభాగంలో రాస్తే, దానిని తర్వాత సరిదిద్దడానికి ఎలాంటి అవకాశం ఉండదని బోర్డు స్పష్టం చేసింది. ఇది విద్యార్థులలో క్రమశిక్షణను పెంచుతుందని, తనిఖీ ప్రక్రియను, మూల్యాంకనాన్ని మరింత సులభతరం చేస్తుందని బోర్డు భావిస్తోంది.
విద్యార్థులు, స్కూల్స్‌కు బోర్డు ముఖ్య సూచనలు
స్కూల్స్ ఈ కొత్త పరీక్షా విధానంతో విద్యార్థులను ముందుగానే పరిచయం చేయాలని CBSE బోర్డు సూచించింది. బోర్డు పరీక్ష సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, చదువుతున్నప్పుడే విద్యార్థులకు విభాగాల వారీగా సమాధానాలు రాసేలా చూడాలని పాఠశాలలను కోరారు. దీనితో పాటు, తాజా నమూనా ప్రశ్నా పత్రాలను తప్పనిసరిగా చూడాలని CBSE విద్యార్థులకు సూచించింది.
నమూనా పత్రాలు టెన్త్ ఎగ్జామ్స్ ప్రశ్నా పత్రం ఫార్మాట్, విభాగాల సంఖ్య, ప్రశ్నల రకాలు, మార్కుల విభజనను అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు సహాయపడతాయని CBSE తాజా ప్రకటనలో తెలిపింది. నమూనా పత్రంతో పాటు జారీ చేసిన మార్కింగ్ స్కీమ్‌ను చూడటం ద్వారా, సమాధానాలను ఎలా రాయడం ద్వారా పూర్తి మార్కులు పొందవచ్చో కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. సరైన సమాచారం కోసం CBSE అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని విద్యార్థులకు బోర్డు సూచించింది.






















