Degree Admissions: 'దోస్త్' అడ్మిషన్ల వివరాలు వెల్లడి, డిగ్రీలో 52% అమ్మాయిలే - బీకామ్ కోర్సు వైపే యువత మొగ్గు!
DOST Admissions: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'దోస్త్-2023' సీట్ల కేటాయింపు పూర్తయింది. డిగ్రీలో మొత్తం 3.88 లక్షల సీట్లకుగాను.. 2,04,674 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
DOST Degree Admissions 2023-24: తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'దోస్త్-2023' సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు 2 లక్షల మార్కును దాటాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 50 వేలకు పైగా అడ్మిషన్లు నమోదుకావడం విశేషం. అన్ని దశల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత డిగ్రీలో మొత్తం 3.88 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 2,04,674 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 1.84 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని సొసైటీల పరిధిలో మొత్తం 78 గురుకుల డిగ్రీ కళాశాలల్లో 21,254 సీట్లు ఉన్నాయి. వాటిలో సగం కూడా భర్తీ కాలేదు.
బీకామ్ వైపే మొగ్గు..
రాష్ట్రంలో డిగ్రీలో బీకాం కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మొదటి విడత కౌన్సెలింగ్ నుంచే అత్యధిక విద్యార్థులు బీకామ్ వైపే మొగ్గుచూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరం బీకామ్ కోర్సులో 85,153 మంది విద్యార్థులు దోస్త్-2023 ద్వారా ప్రవేశాలు పొందారు. అంటే మొత్తం కోర్సులతో పోల్చితే బీకాం వాటా 41.60 శాతం. బీకాం తర్వాత బీఎస్సీ లైఫ్‌సైన్సెస్ కోర్సులకు రెండవ ప్రాధాన్యం లభించింది. ఈ కోర్సుల్లో 43,180 మంది విద్యార్థులు చేరారు. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన స్కిల్ సెక్టార్ కోర్సుల్లో 1,398 మంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్‌లో 889 మంది విద్యార్థులు సీట్లు పొందారు.
ప్రవేశాల్లో అమ్మాయిల జోరు..
డిగ్రీ కళాశాలల ప్రవేశాల్లో అమ్మాయిలే అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల డిగ్రీ కళాశాలల్లో కలిపి మొత్తం 2,04,674 మంది ప్రవేశాలు పొందితే ఇందులో 96,524 మంద అబ్బాయిలు ఉండగా.. 1,08,150 మంది అమ్మాయిలు ఉన్నారు. తెలంగాణకు పొరుగు రాష్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మొదలైన రాష్ట్రాల నలుమూలల నుండి విద్యార్థులు దోస్త్ అడ్మిషన్‌లలో వివిధ డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరుతుండటాన్ని గర్విస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శుక్రవారం (నవంబరు 17) ఒక ప్రకటనలో తెలిపారు.
➥ ప్రభుత్వ కాలేజీల్లోనే అధికంగా సీట్ల భర్తీ
➥ కోర్సుల్లో బీకామ్‌లోనే ఎక్కువ ప్రవేశాలు
➥ ఇతర రాష్ట్రాల విద్యార్థులకూ ప్రవేశాలు
యాజమాన్యాల వారీగా సీట్ల భర్తీని పరిశీలిస్తే.. ప్రభుత్వ కాలేజీల్లోనే అధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. ఇటీవలే డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా, ఆయా వివరాలను ఉన్నత విద్యామండలి (చైర్మన్) ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఆయా వివరాలిలా ఉన్నాయి.
కళాశాలలవారీగా ప్రవేశాలు ఇలా..
యాజమాన్యం | కాలేజీల సంఖ్య | సీట్ల సంఖ్య | చేరిన విద్యార్థులు (శాతం) |
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు | 155 | 87,112 | 53,886 (61.86) |
ప్రైవేటు డిగ్రీ కళాశాలలు | 831 | 2,80,683 | 1,41,772 (50.50) |
గురుకుల డిగ్రీ కళాశాలలు | 78 | 21,254 | 9,016 (42.42) |
కోర్సుల వారీగా ప్రవేశాల వివరాలు..
కోర్సు | సీట్ల వివరాలు |
బీఏ | 29,752 |
బీబీఏ | 15,160 |
బీబీఎం | 107 |
బీకాం | 85,153 |
బీఎస్సీ లైఫ్ సైన్సె స్ | 43,180 |
బీఎస్సీ ఫిజికల్ సైన్స్ | 25,937 |
బీఎస్‌డబ్ల్యు | 56 |
బి.ఒకేషనల్ | 28 |
డిప్లొమా | 595 |
మొత్తం | 20,4674 |