TS DEECET: టీఎస్ డీఈఈ సెట్-2024 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
DEECET: తెలంగాణలో డీఈఈ సెట్-2023 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 17 నుంచి డీఈఈ సెట్ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
TS DEECET Phase 2 Counselling: తెలంగాణలో డీఈఈ సెట్-2023 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 17 నుంచి డీఈఈ సెట్ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ శ్రీనివాసచారి జనవరి 11న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు జనవరి 17న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. తర్వాత జనవరి 18 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జనవరి 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 26 నుంచి 29 మధ్య సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మొదటివిడత కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 1152 మంది అభ్యర్థులు కళాశాలల్లో చేరారు. సీట్లు పొందినవారికి 2023-25 విద్యాసంవత్సరానికి గానూ డీపీఎస్ఈ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం విద్యాశాఖ అధికారులు జూన్1న డైట్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించగా.. జూన్ 14న ఫలితాలు విడుదల చేశారు. డీఈఈసెట్ పరీక్షలో మొత్తం 77.18% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షకు మొత్తం 5,150 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. 3,975 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో తెలుగు మీడియంలో 2,043 మంది పరీక్ష రాయగా.. 1,551 (75.91%) మంది, ఇంగ్లిష్ మీడియంలో 2,495 మందికి 2,114 (84.72%) మంది, ఉర్దూ మాధ్యమంలో 612కి 310 (50.65%) మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసిన 837 మంది అబ్బాయిల్లో 712 మంది, అమ్మాయిలు 4,313 మందికి 3,263 మంది అర్హత సాధించారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్హతతో డీఎడ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థుల్లో ఆందోళన చెందారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు మేనేజ్‌మెంట్ కోటా కింద చేరాలనుకుంటున్న అభ్యర్థులు కన్వీనర్ కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందించలేదు. సిబ్బంది సైతం కళాశాలల జాబితా పంపాలని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులను కోరారు. ఈ మొత్తం జాప్యానికి కారణం పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. నిరుడూ నెలల తరబడి జాప్యం తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించడంతో 20 కళాశాలలు ప్రవేశాలు చేపట్టలేదు. డిగ్రీ లేదా ఇతర కోర్సుల్లో చేరాలో.. డీఎడ్‌లో ప్రవేశాల కోసం ఆగాలో విద్యార్థులు తేల్చుకోలేకపోయారు. అయితే డీఈఈసెట్ ఫలితాలు వచ్చిన ఆరు నెలల తర్వాత అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూలును విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 20 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. జనవరి 5 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది. మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా 1152 మంది అభ్యర్థులు ప్రవేశాలు పొందారు. మిగిలిన సీట్ల భర్తీకి తాజాగా రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు విడుదల చేశారు.
రాష్ట్రంలో 10 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 1,400 సీట్లుండగా, 62 ప్రైవేటు కాలేజీల్లో 3,350 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతంతో పోలిస్తే డీఎడ్ కోర్సు అందించే కళాశాలల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2016-17లో 212 కళాశాలలుండగా... నిరుడు 109కి తగ్గింది. డీఎడ్ కోర్సుతోపాటు డైట్ కళాశాలలపైనా విద్యాశాఖ గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలున్నాయి. కొన్నిచోట్ల కళాశాలల స్థలాలను రైతుబజార్ల నిర్వహణకు ఇస్తున్నారు. కొంతకాలంగా అధ్యాపకుల నియామకాలూ లేవు.