Best Teaching Skills: క్లాస్ అర్థమయ్యేలా చెప్పడానికి స్పెషల్ సూట్.. సార్ పాఠం వింటే బుర్రలోకి వెళ్లిపోవాల్సిందే
Mancherial Teacher | తరగతి గదిలో పాఠాలు ఎవరైనా చెబుతున్నారు. కానీ పిల్లలకు అర్థమయ్యేలా క్లాసులు చెప్పాలంటే కొందరికే సాధ్యమవుతుంది. ఆ కోవలోకే వస్తారు మంచిర్యాల జిల్లాలోని భీంపుత్ర శ్రీనివాస్ సార్.

Mancherial Teacher Bheemputra Srinivas | మందమర్రి: సాధారణంగా స్కూల్లో టీచర్లు పాఠాలు చెబుతుంటూ చాలా మంది విద్యార్థులకు అంతా ఆసక్తి ఉండదు. కొన్ని సబ్జెక్టులు అయితే విడమరిచి చెప్పినా వారికి ఏదో డౌట్ వస్తుంది. కొందరు టీచర్లు మాత్రం తాము క్లాసులు చెప్పడం మాత్రమే కాదు, విద్యార్థులకు అర్థమయ్యేలా.. చెప్పింది వారి బుర్రలోకి అలా నిక్షిప్తం అయ్యేలా వివరిస్తారు. ఆ కోవలోకే వస్తారు టీచర్ భీంపుత్ర శ్రీనివాస్.
ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై లోతైన అవగాహన కల్పించాలంటే, వారికి ఇష్టమైన పద్ధతుల్లో నేర్పించడమే ఉత్తమ మార్గమని అంటున్నారు మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలోని జలంపెల్లి గ్రామానికి చెందిన మంథల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు భీంపుత్ర శ్రీనివాస్. విద్యార్థులు స్వయంగా అభ్యసించి, ప్రత్యక్ష అనుభవాల ద్వారా విషయాలను తెలుసుకునేలా బోధనను రూపొందించడం టీచర్ల ముందున్న అసలైన సవాలని పేర్కొన్నారు.

"మానవ శరీరం - అంతర్గత అవయవాలు" పాఠం
పరిసరాల విజ్ఞానంలో పలు అంశాలను జీవితాంతం గుర్తుంచుకునేలా క్షేత్ర పర్యటనలు, ప్రత్యక్ష బోధనా పద్ధతులను గత రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి చేస్తూ వచ్చారు. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా "మానవ శరీరం - అంతర్గత అవయవాలు" అనే క్లిష్టమైన అంశాన్ని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు టీ-షర్టులపై అవయవాలను ముద్రించి వినూత్నంగా ప్రయోగించారు భీంపుత్ర శ్రీనివాస్. 5వ తరగతి విద్యార్థులకు ఈ స్పెషల్ సూట్ ధరించి వారికి అర్థమయ్యేలా బోధించిన టీచర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన క్లాస్ తీసుకునే విధానం వైరల్ అవుతోంది.
ఈ ఆవిష్కరణ విద్యార్థులకు శారీరక అవయవాలపై స్పష్టమైన అవగాహనను కల్పించడంతో పాటు, శ్రీనివాస్ ని జాతీయ స్థాయిలో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కార్యక్రమంలో ప్రతినిధిగా ఎంపిక అయ్యే స్థాయికి చేర్చింది. అంతేకాదు, ఈ టీ-షర్ట్ మోడల్ అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు తరగతుల్లో బోధనోపకరణంగా వినియోగించటం గర్వకారణమన్నారు.

శరీర నిర్మాణం విజువల్‌గా వివరించే ప్రయత్నం
ఈ విజయానికి కొనసాగింపుగా ఇప్పుడు మరింత సమగ్ర అవగాహన కోసం "INTERNAL ORGANS – FULL BODY SUIT" అనే మానవ శరీర ముసుగును రూపొందించారు. ఇందులో అస్థిపంజర వ్యవస్థ, కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ, శ్వాస, జీర్ణ, విసర్జన వ్యవస్థలపై వివరణాత్మకంగా ముద్రించి ఉండటం వల్ల విద్యార్థులు శరీర నిర్మాణాన్ని విజువల్‌గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
సైన్స్ అంటే సులభం అనుకోవాలి..
"సైన్స్ అంటే సంక్లిష్టం కాదు – సరళం కావాలి, సులభంగా అర్థమయ్యేలా ఉండాలి" అనే నా అభిప్రాయం ఈ ప్రయోగాల వెనుక ఉన్న ప్రేరణ అని.. ఈ ప్రయోగాలు తరగతి గదిలో పిల్లల అభ్యాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తన వంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు అంకితమిస్తున్నట్టు చెప్పారు. అంతేగాక, ఈ బాడీ సూట్‌ను సిద్ధం చేసిన ఎమరాల్డ్ సత్యం గారికి, అవయవాలు ముద్రించిన సప్తగిరి ఆర్ట్స్ రాజు, ప్రేమ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






















