Revanth Reddy Funds to OU: ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో వర్సిటీని డెవలప్ చేస్తాం: రేవంత్ రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు అయినా సరే నిధులు అందిస్తామని, ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana Govt Funds to Osmania University: హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రూ.1000 కోట్లు కావాలన్నా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. ఓయూను స్థాయిని స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖ కోసం ఏడాదికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నేటి ఉదయం ఉస్మానియా వర్సిటీలో రూ.90 కోట్లతో కొత్తగా నిర్మించిన దుందుభి, బీమా హాస్టల్ భవనాలను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు. ఈ యూనివర్సిటీ తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలి. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఇంజనీర్స్ కమిటీని ఏర్పాటు చేసి అంచనాలు తీసుకురమ్మని ఆదేశించాను. మీ అవసరాలు ఏవైనా ఉంటే చెప్పండి, మేము నిధులు మంజూరు చేస్తాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
నిరసనలు చేయనివ్వండి – పోలీసులెవ్వరూ కనిపించొద్దు
యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాను. ఆర్ట్స్ కాలేజీ వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నేరుగా నిధులు కేటాయిస్తానని భరోసా ఇచ్చారు. ఆరోజు నిరసనలు తెలిపే వారిని నిరసన తెలపనివ్వండి. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కూడా కనిపించకూడదని డీజీపీని ఆదేశిస్తున్నాను. నేను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. కొంతమంది రాజకీయ నాయకులు పదవులు పోయాయని బాధపడుతున్నారు. తమ కొడుకులను ప్రోత్సహించలేకపోయారని ఆవేదన చెందుతున్నారు. కానీ వారి ఉచ్చులో మీరు పడొద్దు. సమస్య ఉంటే మాకు చెప్పండి, మా మంత్రులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ గ్రూప్ 1, 2 లాంటి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కాదు తెలంగాణ సమాజాన్ని పునర్ నిర్మించడానికి అవసరమైన మేథా సంపత్తిని ఆశిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అయి జిల్లా ఉన్నతాధికారులుగా పరిపాలన సాగిస్తున్నాం. 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఓటు హక్కు వయసును తగ్గించుకున్నాం. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అవుతుంటే అదే వయసులో ఎమ్మెల్యేగా పోటీ చట్టసభల్లోకి ప్రవేశించి ప్రజా సేవ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
అబద్ధాల ప్రచారాలకు లోను కాకండి
కోదండరాం పై గతంలో జరిగిన కుట్రలను ప్రస్తావిస్తూ, “కోదండరాం సార్‌ను సుప్రీం కోర్టు వరకు లాగి పదవి నుంచి తొలగించారు. ఇదేంటీ పైశాచిక ఆనందం? మేము మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాం” అని ప్రకటించారు. ప్రభుత్వంపై సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం ఆరోపించారు. “ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో సింహాలు, ఏనుగులు ఉన్నాయని సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అడ్డుకున్నారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు. కానీ మానవ రూపంలో ఉన్న మృగాలు మాత్రం ఉన్నాయి. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. వాళ్లు తిరిగి వస్తే ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఉండనివ్వరు,” అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
యూనివర్సిటీ అభివృద్ధి బాధ్యత నాది
“మీ చదువుకు ఏం కావాలో అడగండి. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేయడం నా బాధ్యత. తెలంగాణ సమాజం బాగు కోరని అబద్ధాల సంఘం మాటలను నమ్మొద్దు,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేను పొట్టి శ్రీరాములు పేరును మార్చి రజాకర్లపై పోరాడిన, పాత్రికేయుడిగా రాణించిన సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం. వాళ్లు మన స్ఫూర్తి ప్రధాతలు. ఐఐఎఫ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం. కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐకమ్మ పేరు పెట్టి వారి పోరాటాన్ని గుర్తించుకున్నాం. కానీ సిద్ధాంతాలు నచ్చక కొందరు మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులను గంజాయికి అలవాటు చేసి ప్రశ్నించాల్సిన యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది.
ఒకనాడు దేశంలో, తెలంగాణ సమాజంలో ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ల్యాండ్ చట్టాలతో దళితులు, గిరిజనులు, పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఆనాడు భూమి ఉంటే గౌరవం అని ఇందిరమ్మ పోరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పట్టాలిచ్చాయి. పోడు భూముల పట్టాలు, 25 లక్షల భూములు దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పట్టాలుగా అందాయి. చదువు, చైతన్యం ఉంటేనే రాణిస్తారు. నా వద్ద పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. నేను ఇవ్వగలిగింది నాణ్యమైన విద్య ఒక్కటే.
పంచడానికి భూములు లేవు..
రాష్ట్రంలో భూములు లేవు. పంపకాలు జరిగాయి. 1.50 కోట్ల ఎకరాలు సాగవుతుంటే 96 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఒకట్రెండు ఎకరాలు ఉన్నవారే. అందుకే మీరు ధనవంతులు కావాలంటే మేం నాణ్యమైన విద్యను అందిస్తాం. విద్యా ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ విలువైన సలహాలు, సూచనలు యూనివర్సిటీ ద్వారా ఇవ్వాలని’ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.






















