NMMS: నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు చేశారా? సెప్టెంబరు 30 వరకు అవకాశం!
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోంది..
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ కోసం సెప్టెంబరు 30 లోపు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సూచించారు. 9వ తరగతి విద్యార్థులు కొత్తగా స్కాలర్‌షిప్ కోసం, 10వ తరగతితోపాటు ఇంటర్ (11వ, 12వ తరగతుల) విద్యార్థులు రెన్యువల్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
Website: www.bse.telangana.gov.in
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది.ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తోంది.
రూ.12వేల స్కాలర్‌షిప్
⦁ ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ /10+2 తత్సమాన తరగతి పూర్తిచేసే వరకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
⦁ తొమ్మిదో తరగతి నుంచి పదోతరగతికి స్కాలర్‌షిప్ కొనసాగాలంటే.. అభ్యర్థి 55శాతం మార్కులతో ప్రమోట్ కావాలి. అలాగే పదోతరగతిలో 60శాతం మార్కులు సాధిస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 55శాతం మార్కులతో ప్రమోట్ అయితే రెండో సంవత్సరంలో స్కాలర్‌షిప్ అందిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్‌షిప్ రెన్యూవల్ చేసుకోవాలి.
అర్హతలు:
⦁ ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్‌ను పొందిన విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.
⦁ ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు కాదు. అలాగే ప్రయివేట్ స్కూళ్లలో చదవుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
⦁ విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.1,50,000 మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. రాష్ట్రాల వారీగా నిర్ణీత పద్ధతిని అనుసరించి స్కాలర్‌షిప్స్ సంఖ్యను నిర్ణయిస్తారు. ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి రిజర్వేషన్లు అమలు చేస్తారు.
రాత పరీక్ష :
⦁ ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
⦁ మెంటల్ ఎబిలిటీ టెస్ట్(మ్యాట్): ఈ పేపర్‌లో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ నుంచి 90ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.
⦁ స్కాలాస్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్(శాట్): ఈ పేపర్‌లోనూ 90ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయి లో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
⦁ పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.
కనీస మార్కులు:
రెండు పరీక్ష(మ్యాట్, శాట్)ల్లో సగటున జనరల్ అభ్యర్థులకు 40శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
దరఖాస్తు విధానం
రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను ఆదాయం,కుల ధ్రువీకరణ తదితర అటెస్టెడ్ కాపీలను డీఈఓలకు పంపాలి. దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ. 100 ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.
నేరుగా ఖాతాల్లోకే స్కాలర్‌షిప్..
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిపి ఒక జాయింట్ అకౌంట్‌ను ఎస్‌బీఐలో ఓపెన్‌చేయాలి.రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం–ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.3000లను అభ్యర్థుల ఖాతాలో జమచేస్తారు.