MBBS Results: ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల, 77 శాతం ఉత్తీర్ణత నమోదు!
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఏప్రిల్ 6న ప్రకటించింది. ఫలితాల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఏప్రిల్ 6న ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 77శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 127 మంది డిస్టింక్షన్ రాగా.. 2,240 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. మిగిలిన 1767 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొత్తం 5,369 మంది విద్యార్థులు హాజరుకాగా, 4,134 మందిఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
KNRUHS - EXAMINATION - RESULTS OF I MBBS (OLD REGULATION) EXAMINATION
KNRUHS - EXAMINATIONS - RESULTS OF I MBBS (2019 REGULATIONS) EXAMINATION
KNRUHS - EXAMINATIONS -RESULTS OF I MBBS (2019 REGULATIONS) EXAMINATION BACKLOG CANDIDATES
తెలంగాణలో మరో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..
తెలంగాణకు మరో మూడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో వంద చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మూడు కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వాటి అనుమతి ప్రక్రియ వివిధ దశల్లో ఉందని.. వాటికి కూడా అనుమతి వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అనుమతి వచ్చిన మూడు వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని స్పష్టం చేశాయి.
ఇటీవల సీఎం కేసీఆర్ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాతి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్‌లో నిధులనూ కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. ఇక కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 చొప్పున మొత్తం 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
Also Read:
కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!
తెలంగాణలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో జులై నాటికి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో 9 కొత్త వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మార్చి 28న జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు. కళాశాలకు అవసరమైన ఫర్నిచర్, పరికరాలను సమకూర్చుకోవాలని, అన్ని సదుపాయాలతో కూడిన వసతిగృహాలు సిద్ధం చేయాలని సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..