JNTU Exams: విద్యార్థులకు అలర్ట్, పాత విధానంలోనే జేఎన్‌టీయూ పరీక్షలు
ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు ఇకపై పాత విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా సమయంలో బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ సెమిస్టర్ పరీక్షల విధానంలో పలు మార్పులు చేసి పరీక్షలు నిర్వహించారు.
జేఎన్‌టీయూ హైదరాబాద్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు ఇకపై పాత విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా సమయంలో బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ సెమిస్టర్ పరీక్షల విధానంలో పలు మార్పులు చేసి, విద్యార్థులపై ఒత్తిడిలేకుండా.. ఛాయిస్, సమయం ఎక్కువగా ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రంలో 8 ప్రశ్నలుంటే ఏవైనా 5 రాసేందుకు వెసులుబాటు కల్పించారు.
ప్రస్తుతం కొవిడ్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. పాత నిబంధనలను తిరిగి అమల్లోకి తీసుకురావాలని ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ఇకపై సెమిస్టర్ ప్రశ్నపత్రంలో రెండు భాగాలుంటాయి. మొదటి భాగంలో తప్పనిసరిగా రాయాల్సిన 10 లేక 5 ప్రశ్నలుంటాయి. రెండో భాగంలో 5 యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి తప్పనిసరిగా సమాధానం రాయాల్సి ఉంటుంది. బీటెక్, ఎంటెక్‌లో హాజరు ఆధారిత డిటెన్షన్ విధానం అమలవుతుంది. దీని ప్రకారం విద్యార్థులకు సెమిస్టర్‌లో తప్పకుండా 75శాతం హాజరు ఉండాలి. కండోనేషన్ కింద పది శాతం మినహాయింపు లభిస్తుంది.
టెన్షన్ రేపుతున్న డి'టెన్షన్' విధానం..
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులకు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించకపోతే విద్యార్థులు మరుసటి సంవత్సరానికి ప్రమోట్ అయ్యేందుకు వీలుండదు. జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఏటా నిర్దేశిత క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అలాగే హాజరు 75 శాతం ఉంటేనే సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. కరోనాతో రెండేళ్లు హాజరుతోపాటు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విధానం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదిలోకి వెళ్లాలంటే 18 క్రెడిట్స్, రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 47 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 73 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యా్ర్థులు రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 25 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 51 క్రెడిట్స్ ఉండాలి. ఒకవేళ విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించలేకపోతే మరుసటి ఏడాదిలోకి ప్రవేశించే వీలుండదు. ప్రస్తుతం రెండు, మూడో ఏడాది విద్యార్థులు 2022-23లో మూడు, నాలుగో ఏడాదిలోకి ప్రవేశించాలనుకుంటే నిర్దేశిత క్రెడిట్స్ సాధించాలని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది.
విద్యార్థుల మండిపాటు..
క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు యూనివర్సిటీ ఇచ్చిన ఆదేశాలపై విద్యార్థులు మండిపడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఇంజినీరింగ్ రెండో, మూడో ఏడాదిలో ఉన్న విద్యార్థులు.. కరోనా సమయంలో మొదటి, రెండో ఏడాదిలో ఉన్నవారే. అప్పట్లో తరగతులు సరిగా జరగలేదు. ఈ కారణంగా వారు పరీక్షలు సరిగా రాయలేకపోయారు. దీంతో క్రెడిట్స్ తక్కువగా వచ్చాయని, ఇప్పటికిప్పుడు క్రెడిట్స్ దక్కించుకోవాలంటే ఎలా సాధ్యమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు మరో ఏడాది వెసులుబాటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
:: Also Read::
నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...