ఈజీగా ఇంటి నుంచి ఇంటర్వ్యూలు..
Video Interview Preparation: కోవిడ్ వల్ల చాలా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులను ఆన్‌లైన్ విధానంలోనే ఎంపిక చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీడియో ఇంటర్వ్యూలకు సంబంధించిన సలహాలు & సూచనలు మీకోసం..
కోవిడ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఇంట్లో కూర్చుని ఎన్ని పనులైనా చేయవచ్చని నేర్పింది. విద్యార్థులు, ఉద్యోగుల జీవితాల్లోనైతే పెను మార్పులే తీసుకొచ్చిందని చెప్పవచ్చు. పాఠశాలలకు, విద్యా సంస్థలకు వెళ్లకుండానే ఆన్‌లైన్ విధానంలో చదువులు చకచకా సాగుతున్నాయి. ఇక చాలామంది ఉద్యోగులైతే ఏడాదికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తోనే గడిపేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడిప్పుడే చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, ఒక జాబ్ నుంచి ఇంకో దానికి మారాలనుకునే వారి పరిస్థితి ఏంటి? కోవిడ్ ముందు వరకూ ఉన్న పరిస్థితుల్లోనైతే ఎంచక్కా వాక్ ఇన్ ఇంటర్వ్యూలలోనో లేదా క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో జాబ్ కొట్టేసేవారు. ఇంకొంత మంది కోర్సులు నేర్చుకుని మరీ ఉద్యోగాలకు ప్రయత్నించేవారు. ఇదంతా జరగడానికి కనీసం కొన్ని రోజులైనా పట్టేది.
ప్రస్తుతం కోవిడ్ తెచ్చిన మార్పుల వల్ల అంతా ఆన్‌లైన్‌లోనే చకచకా సాగిపోతున్నాయి. కోవిడ్ కారణంగా దాదాపు 50 శాతం నియామకాలు ఆన్‌లైన్ వేదికగానే జరుగుతున్నాయని ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ వేదికగా జరిగే వీడియో ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధం అవ్వాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుందాం..
రాత పరీక్షకు సన్నద్ధమవ్వండి
చాలా కంపెనీలు తమ మొదటి రౌండ్ ఇంటర్వ్యూలో రాత పరీక్షను నిర్వహిస్తాయి. ఎదుటి వ్యక్తి తార్కిక నైపుణ్యాలు తెలుసుకునేందుకు ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి పరీక్షలతో పాటు ఆయా రంగాలను బట్టి ఇతర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇలాంటి వాటికి హాజరయ్యేటప్పుడు టైమ్ లిమిట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా లేకపోతే సమయం వృధా అవడంతో పాటు పరీక్ష ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. ఇదంతా ఆన్‌లైన్ వేదికగానే జరుగుతుంది కాబట్టి కాస్త సాధన చేస్తే విజయం మీ సొంతం అవుతుంది.
నైపుణ్యాలు అవసరం
మీరు ఏ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారో దానికి సంబంధించిన నైపుణ్యాలను కలిగి ఉండటం ఉత్తమం. మీరు ఎంచుకున్న జాబ్ ప్రొఫైల్‌లో ఉన్న అంశాలపై కాస్త ఎక్కువ దృష్టి సారించండి. అందులో ఉన్న ప్రతి చిన్న అంశం ముఖ్యమైనదేనని గుర్తుంచుకోండి. రిక్రూటర్ అడిగిన ప్రశ్నలకు ఫ్రొఫైల్‌లో ఉన్న అంశాలను జోడించి సమాధానం ఇవ్వండి. ఒకవేళ మీకు తెలియని అంశాలు ఏమైనా ఉంటే వాటిని భవిష్యత్తులో నేర్చుకుంటామని చెప్పండి. నియామకాలు చేపట్టే వారు మీలో నేర్చుకునే సామర్థ్యం ఉందా లేదా అని కూడా అంచనా వేస్తారు. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
మెరుగైన ఇంటర్నెట్ ముఖ్యం
ఏ ఇంటర్వ్యూకి అయినా ఇంటర్నెట్ సదుపాయం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ సరిగా లేకపోతే ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూసుకోండి. మీరు ఫోన్ లేదా ల్యాప్ టాప్ నుంచి ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే ముందస్తుగానే బ్యాటరీ పూర్తిగా ఉండేట్లు చూసుకోండి. మీ ప్రాంతంలో కరెంటు పోయే పరిస్థితులు ఉంటే ఇంటర్వ్యూ సమయానికి ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తద్వారా ఇంటర్వ్యూని సాఫీగా కొనసాగించవచ్చు.
ముందస్తు ప్రాక్టీస్..
ఇంటర్వ్యూల కోసం గూగుల్ మీట్, జూమ్ వంటి పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు ఏ యాప్ వేదికగా ఇంటర్వ్యూ జరుగుతుందో దాని మీద కనీస అవగాహన పెంచుకోండి. కుదిరితే మాక్ టెస్ట్‌ను ప్రాక్టీస్ చేయండి. దీని వల్ల మీరు కెమెరాలో ఎలా కనబడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది వంటి అంశాలను తెలుసుకోగలుగుతారు.
దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి
మనం ధరించే దుస్తులు ఇంటర్వ్యూలో కీలక పాత్ర పోషిస్తాయి. వీడియో ఇంటర్వ్యూనే కదా, ఏ దుస్తులు అయితే ఏముంటుంది అని లైట్ తీసుకోకండి. వీలైనంత వరకూ ఫార్మల్ దుస్తులు ధరించండి. ఏ ఇంటర్వ్యూకి అయినా ప్రశాంతమైన వాతావరణం అవసరం. కాబట్టి ఎలాంటి గందరగోళ ధ్వనులు లేని ప్రాంతాన్ని ఎంచుకోండి. ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు స్క్రీన్ వైపు కాకుండా కెమెరా వైపు చూసి మాట్లాడండి. ఇక మాటలు స్పష్టంగా వినిపించడానికి మైక్రో ఫోన్ లేదా ఇయర్ ఫోన్స్ ఉపయోగించండి.
తినడం లేదా తాగడం చేయకండి..
ఇంటర్వ్యూని చిరునవ్వుతో ప్రారంభించండి. కంగారు పడకండి. వీలైనంత ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వండి. అలాగే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు అప్రమత్తతతో ఉండండి. కూర్చున్న స్థలం నుంచి అటూ ఇటూ కదలడం, తినడం లేదా తాగడం వంటివి చేయకండి. ఇంటర్వ్యూ సమయానికి 15 నిమిషాలు ముందుగానే సన్నద్ధంగా ఉండండి. ఏ ఉద్యోగానికైనా సమయపాలన చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకండి.
ఆన్‌లైన్‌లో పలు కోర్సులు
ప్రస్తుత డిజిటల్ యుగంలో మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఉద్యోగం సాధించినా కూడా డిజిటల్ నైపుణ్యాలను ముందుగానే నేర్చుకోవడం మంచిది. మీ ఉద్యోగ అవసరాలకు తగ్గట్లు ఆయా కోర్సులపై అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం ప్రతీ కోర్సు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైన కోర్సులను నేర్చుకోండి.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి..
ప్రతి మనిషిలోనూ తన లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. దీనికి కారణం వారికి అవరోధాలు లేవని కాదు. వచ్చిన వాటిని ధైర్యంగా దాటుకుంటూ ముందుకెళ్లారని అర్థం. కాబట్టి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమిస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఆల్ ది బెస్ట్.