Telangana News : దోస్త్ 'ప్రత్యేక' విడత ప్రవేశాలు - సెప్టెంబరు 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్లకు అవకాశం
DOST: తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు వీలుగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
DOST 2024 Special Drive Admissions: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి మరోసారి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు వీలుగా కౌన్సెలింగ్ షెడ్యూలును రూపొందించారు. ఈ మేరకు ఖాళీ సీట్ల భర్తీకి 'స్పెషల్ డ్రైవ్' ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సెప్టెంబరు 3న విడుదల చేశారు. ఇప్పటివరకు దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, చేసుకున్నా సీట్లు పొందనివారు మాత్రమే ఈ ప్రత్యేక విడతకు అర్హులని లింబాద్రి పేర్కొన్నారు.
విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.400 చెల్లించి, సెప్టెంబరు 4 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 9న స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 11న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 11 నుంచి 13 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెప్టెంబరు 12, 13 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.