CBSE Results: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్ - 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
CBSE 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. వారంరోజుల్లో ఫలితాల వెల్లడికి సీబీఎస్ఈ సమాయత్తమవుతోంది. మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
CBSE Exams 2024: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. వారంరోజుల్లో ఫలితాల వెల్లడికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే ఫలితాల వెల్లడి కచ్చితమైన తేదీని, సమయాన్ని మాత్రం సీబీఎస్‌ఈ అధికారికంగా ప్రకటించలేదు. ఫలితాల వెల్లడి తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in, cbse.gov.in ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు; ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలును సీబీఎస్ఈ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 38 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో పదోతరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ పేపర్ల ఆధారంగా ఉత్తీర్ణత
సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలంటే, విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ పేపర్ల ఆధారంగా మార్కులతోపాటు, ఉత్తీర్ణతను నిర్ధారిస్తారు. ఒక అభ్యర్థి రెండు అసెస్‌మెంట్‌లను కలిగి ఉన్న సందర్భంలో ఉత్తీర్ణత సాధించడానికి ఒక సబ్జెక్టులోని థియరీ, ప్రాక్టికల్‌లో 33 శాతం చొప్పున మార్కులను తప్పనిసరిగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌లో “E” లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్స్ సాధించిన విద్యార్థులకు మాత్రమే పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ అభ్యర్థి ఫెయిల్ అయితే అతన్ని ఫలితాన్ని నిలిపివేస్తారు. ఇలా ఒక సంవత్సరం మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక అభ్యర్థి ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, ఎక్స్‌టర్నల్ పరీక్షలలోని 5 సబ్జెక్టుల్లో ఒకదాంట్లో ఫెయిల్ అయితే, సంబంధింత సబ్జెక్ట్ కోసం సదరు అభ్యర్థిని కంపార్ట్‌మెంటల్‌గా పరిగణిస్తారు.
వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు పరీక్షలు..
నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏడాదికి రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించనుంది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది (2025-26 విద్యాసంవత్సరం) ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ నుంచి అమలు చేయనున్నారు. దీనికనుగుణంగా సెమిస్టర్ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కసరత్తులు ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ సీబీఎస్‌ఈని ఈ మేరకు కోరింది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చేనెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించే విధంగా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ నిమగ్నమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఒత్తిడి లేని విద్య కోసమే..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.