(Source: ECI/ABP News/ABP Majha)
AP PGCET 2024: ఏపీ పీజీసెట్ పరీక్ష హాల్‌టికెట్లు ఆలస్యం, డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?
AP PGCET 2024: ఏపీ పీజీసెట్ 2024 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు జూన్ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం జూన్ 10 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
AP PGCET 2024 Halltickets: ఏపీ పీజీసెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి మే 31న హాల్‌టికెట్లను విడుదల చేయాల్సి ఉండగా.. సాంకేతికపరమైన కారణాలు వల్ల జూన్ 5కి వాయిదావేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 10 నుంచి 14 వరకు పీజీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 1 గంట నుంచి 2.23 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది.
ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు...
ఆంధ్ర యూనివర్సిటీ - విశాఖపట్నం, డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ - శ్రీకాకుళం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ - తిరుపతి, డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ - కర్నూలు, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ - అనంతపురం, ద్రవిడియన్ యూనివర్సిటీ - కుప్పం, ఆచార్య నాగార్జన యూనివర్సిటీ - గుంటూరు, కృష్ణా యూనివర్సిటీ - మచిలీపట్నం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - తిరుపతి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ - రాజమహేంద్రవరం, యోగి వేమన యూనివర్సిటీ - కడప, క్లస్టర్ యూనివర్సిటీ - కర్నూలు, రాయలసీమ యూనివర్సిటీ - కర్నూలు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ - ఒంగోలు, విక్రమ సింహపురి యూనివర్సిటీ - నెల్లూరు, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్ - ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - తిరుపతి.
పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్ తదితరాలు.
ఎంపిక విధానం:
రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. MEd కోర్సుకు రాతపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తారు. మొత్తం మూడు కేటగిరీల వారీగా పీజీసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కేటగిరీ-1 కింద ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్టులకు; కేటగిరీ-2 కింద కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులకు, కేటగిరీ-3 కింద సైన్స్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఆన్సర్ కీలు ఎప్పుడంటే?
➥ జూన్ 10న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 12న విడుదల చేస్తారు. జూన్ 14 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
➥జూన్ 11న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 13న విడుదల చేస్తారు. జూన్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
➥ జూన్ 12న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 14న విడుదల చేస్తారు. జూన్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
➥ జూన్ 13న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 15న విడుదల చేస్తారు. జూన్ 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
➥ జూన్ 14న నిర్వహించే పరీక్ష ఆన్సర్ కీని జూన్ 16న విడుదల చేస్తారు. జూన్ 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.