Engineering Admissions: ఇంజినీరింగ్ ప్రవేశాలకు 'స్పాట్' తర్వాత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్, ఉన్నత విద్యామండలి తీరుతో తలలు పట్టుకుంటున్న విద్యార్థులు
ఏపీలో ఇంజినీరింగ్ స్పాట్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లకు కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉన్నత విద్యామండలి తీరుతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి షాకిచ్చింది. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 18 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది.
అయితే ఎన్నడూ లేని విధంగా స్పాట్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లకు కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 30 వేల సీట్లు మిగిలిపోయాయి. వీటిని కళాశాలలు స్పాట్ కింద భర్తీ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలితే కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. వీటికి బోధన రుసుములు చెల్లిస్తారు. స్పాట్ తర్వాత సివిల్, మెకానికల్ తప్ప ఇతర బ్రాంచిల్లో సీట్లు ఉండవు. ఉన్నవి కూడా నాణ్యత లేని కళాశాలల్లో మాత్రమే ఉంటాయి. ఆసక్తి ఉన్నా లేకపోయినా వీటిల్లోనే చేరాల్సిన పరిస్థితి తలెత్తుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
బోధన రుసుముల భారం తగ్గించుకునేందుకేనా?
స్పాట్ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు ఉండదు. అదే మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా చేరితే ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళనతో ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టాలని కోరుతున్నారు. ఫీజుల డబ్బులను మిగుల్చుకునేందుకు ఒక విడత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం ఎత్తివేసిందని వారు విమర్శిస్తున్నారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్ నోటిఫికేషన్ ఇచ్చినందున చాలా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి.
స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
ఓయూలో దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీబీ రెడ్డి తెలిపారు. యూకేపీ ఆదేశాల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..