Vijayanagaram News: 'నా బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలి, కాస్త సాయం చెయ్యండయ్యా' - ఎవరూ పట్టించుకోలేదు, చివరకు!
Andhra News: ఒక్కరు.. ఒక్కరంటే ఒక్కరు ముందుకు వచ్చి సకాలంలో ఆ యువకున్ని ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కేవి. ఆ కన్నతల్లికి గుండెకోత తప్పేది. విజయనగరంలో హృదయ విదారక ఘటన.
Heart Breaking Incident In Vijayanagaram: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కిలోమీటరు దూరంలో ఆస్పత్రి. సాయం చేస్తే 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకోవచ్చు. పక్కనే ఉన్న అతని తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు కన్నీటితో అందరినీ ప్రాధేయపడుతోంది. 'అయ్యా.. కాస్త సాయం చెయ్యండి. నా బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలి.' అంటూ కన్నీటితో వేడుకుంది. అయినా ఏ ఒక్కరూ కనికరం చూపించలేదు. ఆ కన్నతల్లి కన్నీటికి కరగలేదు. అలా చూసుకుంటూ వెళ్లిపోయిన వారే తప్ప ఒక్కరు కూడా ముందుకు వచ్చి బాధితున్ని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇంకొంత మంది సెల్‌ఫోన్‌లో ఫోటో తీస్తూ ఉండిపోయారు తప్ప సాయం చేయలేదు. చివరకు ఎవరో 108కు సమాచారం అందించగా.. అది వచ్చే సరికే అమ్మ కళ్ల ముందే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన విజయనగరంలో శనివారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని (Vijayanagaram) వైఎస్సార్ కూడలి - గూడ్స్ షెడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన కె.గంగాధరరావు (30) తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళ్తూ.. గూడ్స్ షెడ్డు వద్ద పని ఉందని దిగాడు. అలా ఒక్క అడుగు ముందుకు వేసే సరికి ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గంగాధరరావు కింద పడిపోయాడు. ఇది చూసిన తల్లి గోవిందమ్మ పరుగున వచ్చి తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. 'అయ్యా.. ఎవరైనా సాయం చెయ్యండి. నా బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలి.' అంటూ ఆ తల్లి కన్నీటితో బతిమిలాడినా ఎవరూ కనికరించలేదు. తీవ్ర గాయాలతో ఉన్న యువకున్ని చూసి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అక్కడికి కిలోమీటరు దూరంలోనే ఉన్న మహారాజా ప్రభుత్వ ఆస్పత్రికి 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కానీ ఎవరూ స్పందించలేదు. స్థానికులు ఎవరో 108కు ఫోన్ చేశారు. దాదాపు అరగంట తర్వాత అంబులెన్స్ రాగా.. ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ యువకుని ఊపిరి ఆగిపోయింది. కన్న తల్లి కళ్ల ముందే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి గోవిందమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్ఐ నరేష్ తెలిపారు. గోవిందమ్మ ఇద్దరు కుమారుల్లో గంగాధరరావు చిన్నవాడు. రైల్వే స్టేషన్ సమీపంలో చిన్న పాన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.