Crime News: ఏడో తరగతి బాలికపై లైంగిక దాడి - నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్థులు, సిద్ధిపేట జిల్లాలో ఘోరం
Telangana News: సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడగా.. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిందితుని ఇంటికి నిప్పు పెట్టారు.
Minor Abused In Siddipet District: సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు ఏడో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడగా.. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిందితుని ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి మండలం గురువన్నపేటలో బాలికపై ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు శుక్రవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ దారుణం వెలుగుచూసింది. బాలికను ప్రశ్నించగా అసలు విషయం చెప్పడంతో ఆగ్రహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు యువకుని ఇంటికి వెళ్లారు. అయితే, అప్పటికే యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
నిందితుడి ఇంటికి నిప్పు
ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. యువకుని ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. అంతేకాకుండా.. అక్కడే ఉన్న కారు, జేసీబీని సైతం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బందోబస్తు చర్యలు చేపట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.