Rahul Murder Case: రాహుల్ హత్య కేసులో పది మంది పాత్ర ... కీలక దశలో విచారణ... సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్న పోలీసులు
రాహుల్ హత్య కేసు విచారణ కీలక దశకు చేరింది. ఈ కేసులో పది మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే రాహుల్ హత్య దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
విజయవాడ వ్యాపారి రాహుల్ హత్య కేసులో ఒక్కో నిజం బయటకు వస్తుంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్థారించారు. ఈ హత్యలో మొత్తం పది మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
పది మంది పేర్లు!
విజయవాడ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు పది మంది వరకు హత్యలో పాత్ర ఉన్నట్లు తేలింది. ఎఫ్‌ఐఆర్‌లో నలుగురి పేర్లు చేర్చారు. ఈ జాబితాలో మొత్తం పది మంది చేరే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వీరు రాహుల్ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్నట్లు తేలింది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల తెలిపిన వివరాలతో నగరంలో నిందితులు ప్రయాణించిన మార్గాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు చివరి దశకు చేరిందని పోలీసులు అంటున్నారు. వివరాలు రికార్డు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
కోగంటి సత్యం పేరు ప్రధానంగా
రాహుల్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కోగంటి సత్యం రిమాండ్‌లో ఉన్నారు. సత్యం నుంచి వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మాచవరం స్టేషన్ సీఐ ప్రభాకర్ లీవ్ ఉండడంతో ఇప్పటి వరకు పెనమలూరు ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. సీఐ ప్రభాకర్ తిరిగి విధుల్లో చేరడంతో ఆయన తిరిగి కేసు బాధ్యతలు తీసుకున్నారు.
రాహుల్ మర్డర్ కేసులో ముందు నుంచి కోగంటి సత్యం పేరు ప్రధానంగా వినిపించింది. రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో కోగంటి పేరును చేర్చారు.
బెంగళూరులో అరెస్టు
ఈ నెల 19 న రాహుల్ హత్య జరిగింది. కోగంటి సత్యం 22వ తేదీ వరకు విజయవాడలోనే ఉన్నాడు. పోలీసులకు తన కోసం వస్తున్నారని తెలుసుకుని ఈ నెల 23న బెంగళూరు పారిపోయాడు. అక్కడ నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కోగంటి కోసం గాలింపు చేపట్టిన విజయవాడ పోలీసులకు ఆయన బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందింది. ఈ మెయిల్ ద్వారా బెంగళూరు ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ్నుంచి స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంట్ పై కోగంటిని విజయవాడ తరలించారు. విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు.
24 క్రిమినల్ కేసులు
రాహుల్ మర్డర్ కేసులో కోగంటిని ఏ4గా పోలీసులు చేర్చారు. ప్రధాన నిందితుడు ఏ1 కోరాడ విజయ్ కుమార్ తో కలిసి రాహుల్ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కోగంటి సత్యంపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Chittoor News: రాత్రికి రాత్రి పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ