Tollywood Drugs Case : క్లీన్‌చిట్ ఇచ్చిన కేసులో ఈడీ నోటీసులా..? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెర వెనుక ఏం జరుగుతోంది..?
సెటిలైపోయిందనుకున్న కేసులో కొత్తగా నోటీసులు రావడంతో టాలీవుడ్ స్టార్లలో ఆందోళన కనిపిస్తోంది. ఈడీ హఠాత్తుగా నోటీసులు పంపడం వెనుక ఏమి జరిగి ఉంటుందా అని ఆరా తీస్తున్నారు.
టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. కొత్తగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి నోటీసులు టాలీవుడ్ ప్రముఖులకు అందాయి. ఈ కేసు ఇప్పటిది కాదు. నాలుగేళ్ల క్రితం నాటిది. తెలంగాణ పోలీసులు అందరికీ క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. దీంతో టాలీవుడ్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. అయితే హఠాత్తుగా ఉరుము లేని పిడుగులా ఈడీ సీన్‌లోకి వచ్చింది. అసలు ఈడీకి ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏం జరిగింది..? అనే ఆందోళన ఇప్పుడు టాలీవుడ్‌లో కనిపిస్తోంది.
అసలు డ్రగ్స్ కేసేంటి..?
టాలీవుడ్ డ్రగ్స్ కేసు బయటకు రావడం అనూహ్యంగా జరిగింది. నాలుగేళ్ల కిందట రవితేజ సోదరుడు భరత్ శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో కారులో ఆయన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనఫోన్‌ను విశ్లేషిస్తే పెద్ద డ్రగ్స్ రాకెట్ ఉందని పోలీసులకు సమాచారం లభించింది. భరత్ గతంలోనూ డ్రగ్స్ కేసుల్లో అరెస్టయ్యారు. భరత్ ఫోన్‌లో లభించినసమాచారం ఆధారంగా కొంత మంది డ్రగ్ పెడ్లర్లను పట్టుకుని కూపీ లాగారు. జూలై 2017 జూన్, జూలై నెలల్లో డ్రగ్స్ కేసు మాత్రమే తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ఉంది. ప్రముఖ సినీతారలతో సహా అరవై మందిని పోలీసులు విచారించారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని ప్రభుత్వం అకున్ సభర్వాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించింది.
అందరూ దొరికిపోయారని మీడియాకు లీకులు.. చివరికి క్లీన్ చిట్..!
విచారణ పూర్తయిన తర్వాత 2017 డిసెంబర్ నుంచి చార్జిషీట్లు వేయబోతున్నామని పోలీసులకు మీడియాకు చెప్పారు. కానీ వేయలేదు. ఆ తర్వాత 2018 జూలైలో.. నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయని మీడియాకు లీక్ ఇచ్చారు. అప్పుడు మరోసారి కేసు హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. ఆ తరవాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. చివరి ఈ ఏడాది జూలైలో చార్జిషీట్ దాఖలు చేశారు. డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో గతంలో విచారించి 11 మంది సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఎవరి పేర్లూ చార్జిషీట్‌లో లేవు. సేకరించిన శాంపిల్స్ రిపోర్టులు ఏమయ్యాయో తెలియదు. పోలీసుల తీరుపై అప్పుడే విమర్శలు వచ్చాయి.
డ్రగ్స్ కేసులను ఈడీకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి పోరాటం..!
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాలుగేళ్ల కిందటి నుంచి ఈ కేసు విషయంపై పోరాడుతున్నారు. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో ఉంది. ఇటీవల ముంబై, బెంగళూరుల్లో డ్రగ్స్ కేసులు వెలుగు చూసినప్పుడు ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా రంగంలోకి దిగి విచారణ జరిపాయి. అందుకే టాలీవుడ్ కేసును కూడా వారికే ఇవ్వాలని రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అవసరం లేదని వాదించింది. ఇప్పటికీ ఆ కేసుపై హైకోర్టులో ఆదేశాలు రాలేదు.
ఈడీ కేసు డ్రగ్స్ వాడుతున్నారని కాదు మనీ లాండరింగ్ పైనే..!
ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడానికి కారణం తెలంగాణ పోలీసులు వారికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఏ ఆధారాలతో వారికి ఈడీ నోటీసులు జారీ చేసిందనేది టాలీవుడ్ ప్రముఖులకు పజిల్ గా మారింది. అయితే ఈడీ నోటీసులు డ్రగ్స్ వాడకానికి సంబంధించినవి కావని.. అవి మనీలాండరింగ్‌కు సంబంధించినవని తెలుస్తోంది. ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు అయింది. వీటికి సంబంధించి విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్ ప్రముఖులు సహా 12 మందికి నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. దకద్రవ్యాల క్రయవిక్రయాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ కోణంలోనే వీరిని ప్రశ్నించనుంది. ఇప్పటికైతే వీరు సాక్షులు మాత్రమే. ఈడీ డ్రగ్స్ కేసును విచారించిన సిట్ చీఫ్ అకున్ సభర్వాల్ వద్ద కూడా సమాచారం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయాలున్నాయా..?
నాలుగేళ్ల క్రితం నాటి కేసులో ఈడీ రంగంలోకి దిగడంపై తెర వెనుక రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానం కొంత మందిలో ప్రారంభమయింది. ఎందుకంటే టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రారంభమవడం.. తర్వాత సైలెంట్ అవడం వెనుక తెర వెనుక ఏదో జరిగిందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఈడీ కూడా ఇలా రావడం వెనుక ఇంకేదో మతలబు ఉంటుందని భావిస్తున్నారు. డ్రగ్స్ కేసు వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం.. సినీ పెద్దల్లో ఉంది. అదేమిటో కొంత మందికి తెలుసని.. చాలా మందికి తెలియదని... ఎవరు టార్గెట్ అయ్యారో.. ఎవరు టార్గెట్ చేస్తున్నారో.. విచారణ ప్రారంభమైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి సినీ తారల ఇష్యూ కాబట్టి రాబోయే కొద్ది రోజులు ఈ అంశం హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.