Vijayawada Crime : విజయవాడలో రౌడీషీటర్ దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా?
Vijayawada Crime : విజయవాడలో రౌడీషీటర్ దారుణ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉంటోందని పోలీసులు భావిస్తున్నారు.
Vijayawada Crime : బెజవాడలో ఇద్దరు రౌడీషీటర్ల మధ్య ఆదిపత్య పోరు, వివాహేతర సంబంధంలో ఒకరు దారుణంగా హత్యకు గుర్యయాడు. హత్య చేసిన తరువాత రౌడీ షీటర్ పరార్ కావటంతో అసలు విషయం బయటకు రాలేదు. మూడు రోజులు తరువాత మృతదేహాం నుండి దుర్గంధం రావటంతో స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వ్యవహారం వెలుగు చూసింది.
ఇద్దరు రౌడీషీటర్లే
విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో రమేష్(38)పై రౌడీషీట్ ఉంది. ప్రియదర్శిని కాలనీకి చెందిన గుంటూరు ప్రవీణ్ పై కూడా రౌడీషీట్ ఉంది. ప్రవీణ్ ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రమేష్ రోజు వారి కూలీ పనులకు వెళుతుంటాడు. ఇద్దరూ కలిసి ఆయుధాలతో ఇతరులపై దాడులు చేసి, భయభ్రాంతులకు గురిచేస్తూ స్థానికంగా దందా సాగిస్తుంటారు. వారి ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదులు రావటంతో పలుసార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయితే వినకపోవటంతో రౌడీషీట్ తెరిచారు. రమేష్‌కు వివాహం అయ్యింది. అయితే భార్య వేరుగా హెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటోంది. అదే ప్రాంతానికి ఎదురుగా ఉండే కాలనీలో ప్రవీణ్ ఉంటున్నాడు. రమేష్, ప్రవీణ్ ఇరువురు ఆటోలో భవానీపురం ప్రాంతంలోనే తిరుగుతుంటారు. భవానీపురంలోని అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రవీణ్ తాతయ్యకు ఓ ఇల్లు ఉంది. ప్రస్తుతం ఇది పాతబడిపోయి ఉంది. ఆ ఇంటికి రెండు రోజుల క్రితం రమేష్, ప్రవీణ్ కలిసి వెళ్లారు.
వివాహేతర సంబంధమే కారణమా?
గురువారం రాత్రి నుంచి ఇంటి నుంచి దుర్వాసన విపరీతంగా వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భవానీపురం ఇన్‌స్పెక్టర్ ఉమర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, రమేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు ఆరా తీయగా, ప్రవీణ్‌తో కలిసి రమేష్ వచ్చినట్టుగా స్థానికులు చెప్పారు. దీంతో పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ ఈ హత్య చేశాడని నిర్ధారించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధమే ఇద్దరు రౌడీషీటర్ల మధ్య మనస్పర్థలకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రవీణ్ బ్రదర్స్ అంతా రౌడీషీటర్లే
నిందితుడుగా అనుమానిస్తున్న ప్రవీణ్‌కు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వారిలో పెద్ద అన్నయ్య లారా పై కూడా రౌడీషీట్ ఉంది. కొన్నాళ్ల క్రితం రౌడీషీటర్ల మధ్య వచ్చిన వివాదంలో లారాను దారుణంగా హత్య చేశారు. మరో అన్నయ్య అజయ్ పై కూడా రౌడీషీట్ ఉందని పోలీసులు చెబుతున్నారు. అన్నదమ్ములంతా పూర్తిగా రౌడీ కార్యకలాపాలకు అలవాటుపడి దారుణాలకు ఓడికడుతుండటంతో పోలీసులు నిత్యం వీరి పై నిఘా ఉంచారు. అయినా అత్యంత చాకచక్యంగా నమ్మించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి, పాడుబడిన ఇంటిలో దారుణ హత్యకు పాల్పటంతో పోలీసులు కేసు దర్యాప్తు పై ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
ప్రతి వారం పోలీసుల కౌన్సిలింగ్
బెజవాడ నగరంలో రౌడీషీటర్లకు కొదవేలేదు. దీంతో పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీషీటర్లను పిలిపించి ప్రతి ఆదివారం వారి వివరాలను, కార్యకలాపాలను పోలీసులు ప్రశ్నిస్తుంటారు. దీంతో అయినా రౌడీషీటర్లు ఎవరికి వారు తమ పని చేసుకుపోతున్నారనేందుకు ఇలాంటి ఘనటలే నిదర్శనం అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.