Hyderabad News: కుప్పకూలిన బతుకులు, స్లాబ్ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం
Hyderabad News: పహాడీ షరీఫ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మామిడిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కూలి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
Hyderabad News: బతుకు దెరువు కోసం పొట్ట చేతపొట్టుకుని ఎక్కడో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చారు. ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరారు. చక్కగా పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటుండగా విధి వెక్కిరించింది. ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా స్లాబ్ కూలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన పహాడీ షరీఫ్‌లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. పహాడీ షరీఫ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మామిడిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కూలి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. భవనంపై రెండో అంతస్తు నిర్మిస్తుండగా స్లాబ్ ఒక్క సారిగా కుప్పలకూలి ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో బిహార్‌కు చెందిన జగదీశ్ (49), యూపీ వాసి తిలక్ సింగ్ (33) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పహాడి షరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే తమ వారి ప్రాణాలు తీసిందని మృతుల బంధువులు ఆరోపించారు. ఘటనతో ప్రాంతం విషాదం అలముకుంది.
కూకట్ పల్లిలో ఇదే తరహా ప్రమాదం
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని అడ్డగుట్టలో ఇదే నెల మొదటి వారంలో ఇదే తరహా ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. గోడకూలి పరంజిపై పడటంతో అక్కడే పనిచేస్తున్న సంతు (23), సోనియా (23) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు తీవ్రంగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సానియా (23) మృతి చెందాడు. వీరంతా రెండు నెలల క్రితం ఒడిశా నుంచి నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు.
మై హోం సంస్థలో ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మై హోం గ్రూపునకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో గత జులై నెలలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు. కర్మాగారంలోని యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడి ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు.
జనవరిలో స్లాబ్ కూలి ఇద్దరు మృత్యువాత
కూకట్‌పల్లిలో గత జనవరిలో ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్ నిర్మాణం కుప్పకూలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మూడు అంతస్తుల భవనంపై కొత్తగా వేసిన నాలుగో అంతస్తు స్లాబ్ కూలి అక్కడ పని చేస్తున్న కూలీలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన దయాశంకర్ (25), ఆనంద్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. స్లాబ్ కూలిన సమయంలో అక్కడే ఉన్న భవన యజమాని లక్ష్మణ్‌రావుకు తలపై గాయం కావటంతో వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.