Telangana Students: తీవ్ర విషాదం - అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telangana News: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వారి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Two Telangana Students Died in Accident In Us: అమెరికాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. కరీంనగర్ (Karimnagar), జనగామ (Janagam) జిల్లాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అక్కడి పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేశ్ (20), జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్ (19) అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వ విద్యాలయంలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్నారు. శనివారం రాత్రి వీరు తమ స్నేహితులతో కలిసి వర్శిటీ నుంచి కారులో ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం వెనుక సీట్లో కూర్చున్న నివేశ్, గౌతమ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతమ్ కుమార్ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్ మృతదేహాన్ని హుజూరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇటీవలే స్కాట్లాండ్ లోనూ
ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు సైతం ఇటీవలే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్ లోని డూండీ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. ఈ నెల 17న బుధవారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి పెర్త్ షైర్ లోని 'లిన్ ఆఫ్ తమ్మెల్'కు వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అనంతరం కొద్ది దూరంలో వీరి మృతదేహాలను గుర్తించారు. వీరి మృతి విషయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు ఉండగా.. మరో విద్యార్థి ఏపీకి చెందిన వారు. అటు, ఈ ప్రమాదంపై లండన్ లోని భారత హైకమిషన్ అధికారి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు, ఈ దుర్ఘటనపై స్పందించిన యూనివర్శిటీ ఆఫ్ డూండీ ప్రతినిధి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఇది మనందరికీ దిగ్భ్రాంతిని గురి చేసిన ఓ విషాద ప్రమాదం. అత్యంత క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం.' అని పేర్కొన్నారు. కాగా, జితేంద్రనాథ్ గతంలో అమెరికాలోని కనెక్టికట్ వర్శిటీలో చదివినట్లు తెలుస్తోంది. చాణక్య 2022లోనే హైదరాబాద్ జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు సమాచారం.
Also Read: Crop Losses: తెలంగాణలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు