Crop Losses: తెలంగాణలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
Telangana News: రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టం జరగ్గా పూర్తి నివేదిక సమర్పించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పరిహారం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
Minister Tummala Key Orders To Officials On Crop Loss: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో అన్నదాతలకు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాలపై దృష్టి సారించింది. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ అదికారులు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం అధికారులతో భేటీ అయ్యి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2,220 ఎకరాలకు అదనంగా, తాజా వర్షాలతో మరో 920 ఎకరాల్లో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. రంగారెడ్డి, నిర్మల్, జనగాం జిల్లాల్లో కొత్తగా పంట నష్టం నమోదైనట్లు చెప్పారు. పంట నష్టంపై పూర్తి నివేదిక అందించాలని.. రైతుల వివరాలు సేకరించాలని మంత్రి అధికారులకు నిర్దేశించారు.
పరిహారం విడుదలపై
ఇప్పటికే మార్చి నెలలో కురిసిన వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం విడుదల చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా, గత నెల వడగళ్లు, అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నిర్ధారించింది. 15,246 మంది రైతులు వివిధ రకాల పంటలు నష్టపోయారన్న అధికారుల నివేదిక మేరకు వారందరికీ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.15.81 కోట్ల పరిహారం అందజేయాలని నిర్ణయించింది. మొత్తం 10 జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వెల్లడించింది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా మరోసారి ఈసీని సంప్రదించి నిధుల విడుదలకు అనుమతి పొందాలని ప్రభుత్వం భావిస్తోంది.
వాటితో పాటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని కూడా త్వరగా మదింపు చేసి నివేదిక సమర్పించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికలు అందిన వెంటనే పరిహార నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అటు, వరి పంట కోతలు ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే 2, 3 వారాల పాటు అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, అకాల వర్షాల సమయంలో పంట నష్టం తగ్గించే విధంగా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నదాతలకు సూచించాలని అధికారులకు నిర్దేశించారు. వానాకాలం ముందు సరఫరా చేసే పచ్చి రొట్ట విత్తనాల సేకరణకు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు.
Also Read: Telangana New CM: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది - రేవంత్ రెడ్డి