Kadapa Cyber Crime: ఇంటి నుంచే సంపాదన పేరుతో మోసం.. రూ.11 కోట్లు స్వాహా.. ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు..
ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించండి అంటూ సైబర్ మోసానికి పాల్పడిన ఇద్దరు నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.11 కోట్లకు పైగా నగదు కొల్లగొట్టినట్లు గుర్తించారు.
సాంకేతికత సాయంతో మోసాలకు తెగబడే వారి ఆగడాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పండుగలు, ప్రత్యేక వేడుకలు వంటి సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు తమ పంజా విసురుతున్నారు. ఆఫర్ల పేరుతో అమాయకులు జేబులు కొల్లగొడుతున్నారు. తాజాగా ఏపీలోని కడపలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని నామక్కల్, ఈరోడ్ జిల్లాలకు చెందిన గోకుల్ వేందన్, మురుగానందన్ అనే ఇద్దరు వ్యక్తులు కడప జిల్లా వ్యాప్తంగా పలువురిని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించండి అంటూ.. ఆర్.సి.సి, మేకింగ్ మనీ యాప్ పేరిట ప్రజలను మోసగించారని తెలిపారు. ఈ యాప్ పేరుతో ఉన్న లింకులను ప్రజల సెల్ ఫోన్లకు పంపారని పేర్కొన్నారు. వీటిని క్లిక్ చేయడం ద్వారా చాలా మంది తమ సొమ్ము పోగొట్టుకున్నట్లు వివరించారు. ఇలాంటి సైబర్ నేరాలతో ఆర్జించిన సొమ్మును విదేశాల్లో బిట్ కాయిన్స్ రూపంలో మళ్లించి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించామని చెప్పారు. వీరి వద్ద నుంచి 23 బ్యాంక్ ఖాతాల్లోని రూ.62.5 కోట్ల నగదును కడప వన్ టౌన్ పోలీసులు ఫ్రీజ్ చేశామని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ వెల్లడించారు.
Also Read: మెడిసన్ ఫ్రమ్ స్కైలో సరికొత్త టెక్నాలజీ.. పేలోడ్ సాయంతో మందులు.. ప్రయోగాత్మకంగా అమలు
కడప నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వీరి మోసాలపై జిల్లాలోని కడప వన్ టౌన్, మైదుకూరు, దువ్వూరు, చాపాడులలో నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రూ. 11 కోట్లకు పైగా నగదు కొల్లగొట్టినట్లు పేర్కొన్నారు. సాంకేతికత సాయంతో మోసగాళ్లను గుర్తించామని చెప్పారు.
బాధితులు ఫిర్యాదు చేయాలి..
ఈ యాప్ కారణంగా ఎవరైనా డబ్బులు పొగొట్టుకుని ఉంటే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని అన్బు రాజన్ తెలిపారు. అపరిచిత లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చంటూ మొబైల్ ఫోన్లకు వచ్చే లింకులు, సందేశాలను నమ్మవద్దని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన కడప పోలీసులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసంABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.