YS Jagan Siddham Meeting: విషాదం నింపిన జగన్ సభ - తొక్కిసలాటలో ఒకరు, బస్సు కిందపడి మరొకరు మృతి
YSRCP Siddham Sabha: బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ ’సిద్ధం‘ రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో ఒకరు, బస్సు కింద పడి మరొకరు మృతిచెందారు.
YS Jagan Siddham Sabha at Medarametla in Bapatla District: మేదరమెట్ల: బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ ’సిద్ధం‘ సభకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి రావడంతో సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఒంగోలు బలరాం కాలనీకి చెందిన ఉదరగుడి మురళి (30)గా గుర్తించారు. ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మురళి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కాగా మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఆ మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అద్దంకిలో సిద్ధం సభ సూపర్ సక్సెస్🔥
— YSR Congress Party (@YSRCParty) March 10, 2024
ఈ సభకు భారీగా తరలివచ్చిన వైయస్ఆర్సీపీ శ్రేణులు..
సభ అనంతరం తమ వాహనాల్లో తిరుగు ప్రయాణం. ఇవి గ్రీన్ మ్యాట్లు కాదు.. గ్రాఫిక్స్ కాదు పప్పు @naralokesh ...
జగనన్న మీద అభిమానంతో వచ్చిన వైయస్ఆర్సీపీ సైన్యం✊🏻#Siddham… pic.twitter.com/RBy1AlxRcj
బస్సు కిందపడి మరొకరు మృతి
బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం సాయంత్రం జరిగిన వైసీపీ ‘సిద్ధం’ సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభకు హాజరై తిరిగి వస్తుండగా బస్సు ముందు డోర్ వద్ద నిల్చొని ఉన్న బాలదుర్గ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సభలో ఓ ఏఎస్సైకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
మేదరమెట్లలో వైసీపీ బహిరంగ సభ
మేదరమెట్లలో వైసీపీ ఆదివారం నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభలో పొల్గొన్న సీఎం జగన్.. ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే, చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను సింహం అని, సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు.
చంద్రబాబు వెంట ఉన్నట్లు నటించే పొలిటికల్ స్టార్లు తన వద్ద లేరంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్న తనకు ఉన్నది కేవలం ప్రజా మద్దతు అని, వారే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామని జగన్ తెలిపారు. చంద్రబాబు మ్యానిఫెస్టోకు శకుని చేతిలోని పాచికలకు తేడాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.