Srikalahasti Fincare Robbery : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఇంటి దొంగల పనే!
Srikalahasti Fincare Robbery : శ్రీకాళహస్తి ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. అసలు చోరీకి ప్లాన్ చేసింది మేనేజర్ స్రవంతి అని పోలీసులు గుర్తించారు.
Srikalahasti Fincare Robbery : శ్రీకాళహస్తి ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థలో చోరీ సంచలనమైంది. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అసలు దొంగతనం ఇంటి దొంగ పనే అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థలో ఇటీవల చోరీ జరిగింది. అర్ధరాత్రి బ్యాంకులో చొరబడిన దుండగులు మేనెజర్ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి సుమారు 80 లక్షల విలువైన బంగారం, నగదు దోచుకెళ్లారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
అసలేం జరిగింది?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దమసీదు వీధిలో గత మూడేళ్లుగా ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థ ఓ బ్రాంచ్ ను నిర్వహిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వారే కాకుండా, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఫైనాన్స్ సంస్థలో బంగారు కొదువ పెట్టి డబ్బు తీసుకుంటున్నారు. అయితే ఫైనాన్స్ సంస్థలో ఈ నెల 26వ తేదీన జరిగిన దోపిడీ స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి ఆఫీన్ పనిలో నిమగ్నమైన ఉద్యోగిని నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి దాదాపు 80 లక్షల విలువ గల బంగారు నగలు, నగదును దుండగులు దోచుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరినీ పిలిచి విడివిడిగా విచారించారు. అయితే మొదటి నుంచి కేసులో పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు ఊహించిన విధంగానే ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది.
ఉద్యోగులే చోరీకి ప్లాన్
శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ అంజూయాదవ్ చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు. తిరుపతి ఎస్పీ సంస్థ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు ఇద్దరిపై అనుమానంతో వారిని వేరు వేరుగా విచారించారు. ఆ ఇద్దరే ఈ కేసులో కీలక సూత్రదారులుగా గుర్తించి, వారి ద్వారా దొంగల వేటను పోలీసులు మొదలుపెట్టారు. అయితే ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఫైనాన్స్ కంపెనీలో చోరీ చేసిన బంగారం, నగదును చెన్నైలో ఓ ద్విచక్ర వాహనం మెకానిక్ వద్దకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నైకు వెళ్లిన ఓ పోలీసు బృందం మెకానిక్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే యువతితో ప్రేమాయణం సాగిస్తున్న యువకుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఫైనాన్స్ కంపెనీలో చోరీ అయింది 80 లక్షల బంగారం, నగదు అని ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు అంటుంటే. కాదు కోటి రూపాయల వరకూ ఉందని, తమ విచారణలో తేలిందని పోలీసులు అంటున్నారు. మొత్తానికి ఫైనాన్స్ కంపెనీలో జరిగిన భారీ దొంగతనం వెనుక ఇంటి దొంగల పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ కేసు దర్యాప్తులో మునిగిన పోలీసులు ఫైనాన్స్ కంపెనీలో ఖాతాదారుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. రేపు మధ్యాహ్నంలోపు ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే మేనేజర్ స్రవంతి గిల్ట్ నగలను తాకట్టు పెట్టి సంస్థలో లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు వస్తుందని ఈ డ్రామా ఆడిందని తెలుస్తోంది.