Tirumala News : తిరుమలలో గంజాయి కలకలం, కూరగాయల మాటున స్మగ్లింగ్!
Tirumala News : తిరుమలలో గంజాయి కలకలం రేపింది. కూరగాయాల వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
Tirumala News : తిరుమలలో గంజాయి కలకలం రేగింది. కూరగాయల వాహనంలో గంజాయిని తరలిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం టీటీడీ విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కూరగాయల వాహనంలో దాదాపు అర కేజీ గంజాయిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో వాహనంలో ఉన్న రెడ్డి, రెహమాన్ అనే ఇద్దరు యువకులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే తిరుమలలోని హోటల్స్, దుకాణాలకు నిత్యం కూరగాయలు తరలిస్తుంటారు. కూరగాయల మాటున కొద్ది కాలంగా గంజాయి తరలిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు గంజాయిని కొండపై ఎవరి అందిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం బాటిళ్లు సీజ్
తిరుమలలో ఇటీవల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు. తిరుమల ఓల్డ్ బార్బర్ క్వార్టర్స్ వద్ద 22 మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది. మద్యం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. నిందితులు సుమలత, నాగేంద్ర ప్రసాద్, బిన్నీ, ప్రవీణ్ కుమార్ వద్ద నుంచి మొత్తం 22 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీళ్లంతా అనంతపురం జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కాంట్రాక్టు పనుల కోసం తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.
తిరుమలలో మాంసం తింటూ పట్టుబడ్డ షికారీలు!
తిరుమలలో ఇటీవల మాంసం తింటూ షికారీలు పట్టుబడ్డారు. వారిని తిరుమల విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో మద్యమాంసాలపై నిషేధం ఉన్నా కొందరు మాత్రం నియమాలను అతిక్రమిస్తున్నారు. నిబంధనలు పాటించే వారికేనని మాకు కాదంటూ కొందరు షికారీలు, స్థానికులు తరచూ తిరుమలలో మాసం మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తిరుమలలోని షికారి వీధిలో కొందరు షికారీలు మాసం వండినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు షికారిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించి విచారణ చేపట్టారు. తిరుమల కొండపై మద్యం, మాంసంపై నిషేధం ఉంది. కొందరు ఈ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. తిరుమలలో మాంసం తింటూ మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తిరుమలలోని షికారీ వీధిలో కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల డ్రోన్ కలకలం
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించిన వీడియో వైరల్ అయింది. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఐకాన్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంమైన శ్రీనివాసుడి దర్శనార్థం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. అయితే తిరుమల కట్టుదిట్టమైన భద్రత వలయాలతో పటిష్టమైన సెక్యూరిటీ కలిగిన దేవస్థానం. ప్రతినిత్యం మాన్యువల్ సెక్యూరిటీ నుంచి మూడో కన్ను వరకు అన్ని కాపు కాస్తూనే ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హైసెక్యూరిటీ నడుమ టీటీడీ విజిలెన్స్, పోలీసు, ఆక్టోపస్ అంటూ వివిధ సెక్యూరిటీ ఫోర్స్ లతో పాటు సీసీ కెమెరాలు నిత్య పర్యవేక్షణలో తిరుమల సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి హైసెక్యూరిటీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ అనుమతి లేకుండా డ్రోన్స్ ఎగురవేస్తే కటకటాల పాలుకావాల్సిందే. ఇక ఇప్పటికే నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ కేంద్ర పౌర విమానయాన శాఖను పలుమార్లు కోరింది. అయితే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన పౌర విమానయాన శాఖ అధికారులు అది సాధ్యం కాదని తేల్చారు. విమానం సంగతి పక్కన బెట్టిన డ్రోన్స్ ఎగరేయరాదనే నిబంధనలు మాత్రం పటిష్టంగా అమలు చేస్తుంది టీటీడీ.