Telangana ACB Raids: తెలంగాణలో ఏసీబీ దాడులు - లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు అధికారులు
Telangana News: తెలంగాణలో ఏసీబీ అధికారులు లంచగొండి అధికారుల పని పట్టారు. హన్మకొండ జిల్లాలో ఓ సబ్ రిజిస్ట్రార్, కొత్తగూడెం జిల్లాలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Telanagana ACB Caught Officers: తెలంగాణ ఏసీబీ (Telangana ACB) అధికారులు మరోసారి దూకుడు పెంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పరకాల పరిధిలోని సీతారామపురానికి చెందిన శ్రీకాంత్, శ్రీనివాస్‌లు వారి తల్లి పేరు మీద ఉన్న 481/cలోని భూమిని మార్పు కోసం సబ్ రిజస్ట్రార్ సునీత వద్దకు వెళ్లగా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు పక్కా ప్లాన్‌తో శ్రీకాంత్, శ్రీనివాస్‌ల నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ నరేష్‌లను పట్టుకున్నారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఏసీబీకి చిక్కిన ఎస్సై
అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ (Kothagudem District) ఓ ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పాల్వంచ టౌన్ ఎస్సై బి.రాము ఓ కేసు విషయంలో మహిళ నుంచి రూ.20 వేలు డిమాండ్ చేయగా.. కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో ఎస్సై ఇంటి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.