Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Annamayya district: అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మార్చడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు ఆయనను ఓదార్చారు.

Minister Ramprasad Reddy tears: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఒక ఆసక్తికర సంఘటనకు వేదికైంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు ప్రతిపాదనపై చర్చ జరుగుతున్న సమయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తన నియోజకవర్గమైన రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మార్చవద్దని ఆయన ముఖ్యమంత్రికి విన్నవించారు.
గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించారు. అయితే, ఎప్పటి నుండో మదనపల్లి ప్రాంత వాసులు జిల్లా కేంద్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూర్తి చేసింది. ఈ క్రమంలో రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చాలని నిర్ణయించారు. అయితే రాయచోటి ప్రజల సెంటిమెంట్‌ను, అక్కడ ఇప్పటికే ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రం మార్పు జరిగితే స్థానికంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.
ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, రంపచోడవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. అన్నమయ్య జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ లను మూడు వేర్వేరు జిల్లాల్లో కలపాలని నిర్ణయించారు.… pic.twitter.com/xrIhzFUjoX
— ABP Desam (@ABPDesam) December 29, 2025
మంత్రి కన్నీరు పెట్టుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆయన్ను ఓదార్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేవలం రాజకీయ కోణంలో కాకుండా, భవిష్యత్తు అవసరాలు, సాంకేతిక అంశాల ప్రాతిపదికన ఉంటాయని వివరించారు. జిల్లా కేంద్రం మార్పు విషయంలో ఉన్న చిక్కులను సీఎం ఈ సందర్భంగా వివరించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా కేంద్రం ఉండాలని, ప్రస్తుత ఏర్పాటులో కొన్ని సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. జిల్లా కేంద్రం ఎక్కడ ఉన్నా, రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయచోటిని ఒక మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతామని, ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
#రాయచోటి కోసం ఏడ్చేసిన మంత్రి మండిపల్లి.. #అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏచ్చిన మంత్రి #రాంప్రసాద్ రెడ్డి..
— Nagarjuna (@pusapatinag) December 29, 2025
జిల్లా కేంద్రంగా నిలుపుకోలేక పోతే రాజీనామా చేస్తానని ఇది వరకే ప్రకటన.. pic.twitter.com/y5IXpX7kb5
ఈ పరిణామంపై రాయచోటి ,మదనపల్లి ప్రాంతాల్లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రం మార్పుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ముందు క్షేత్రస్థాయి పరిస్థితులను మరోసారి పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఏ నిర్ణయం తీసుకున్నా.. కొత్త నిర్ణయాలన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.





















