Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - ఆర్థిక ఇబ్బందులతో తల్లీ కుమారుడి ఆత్మహత్య, ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం
Hyderabad News: తెలంగాణలో విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట ఆర్థిక ఇబ్బందులు తల్లీ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడగా.. మరోచోట లారీని వెనుక నుంచి ఢీకొని ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Mother And Son Forceful Death in Kothapeta: తెలంగాణలో (Telangana) తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడగా.. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుమారుడు సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొత్తపేట ఎస్ఆర్ కాలనీలో తల్లి గంజి పద్మ (40), కుమారుడు వంశీ (18) అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పద్మ భర్త శివ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమె కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కాగా.. బుధవారం రాత్రి పద్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు వంశీ సైతం ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ కుటుంబం ఏపీలోని ఒంగోలు చెందినవారు. కొన్నేళ్లుగా ఎస్ఆర్ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి
అటు, సంగారెడ్డి జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో నాందేడ్ - అకోలా జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్లున్న లారీ బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు పుల్కల్ మండలం గంగోజీపేటకు చెందిన సందీప్, నవీన్, అభిషేక్‌గా గుర్తించారు. వీరంతా కందిలోని అక్షయపాత్రలో డెలివరీ బాయ్స్‌గా పని చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
మరిన్ని ప్రమాదాలు
మరోవైపు, ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ - భీంపూర్ మండలం కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తోన్న బస్సు ఆర్లీ (టీ) గ్రామంలోకి రాగానే అదుపు తప్పు ఓ రైతు కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కట్టేసి ఉన్న ఎద్దును ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో దాదాపు 20 మంది ప్రయాణికులున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే, హైదరాబాద్ చంపాపేట ప్రధాన రహదారిపై ఓ ఇన్నోవా వాహనం వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు చాంద్రాయణగుట్ట రాజ్ నగర్ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో..
అటు, తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ, క్లీనర్‌కు గాయాలు కాగా.. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో రెండు లారీ చక్రాలు విడిపోయి కొద్ది దూరం వరకూ రోడ్డుపై లారీ దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇతర వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad News: హైదరాబాద్‌లో ‘గాడిదగుడ్డు’ హోర్డింగులు - మళ్లీ మొదలుపెట్టిన కాంగ్రెస్!