Hyderabad News: హైదరాబాద్‌లో ‘గాడిదగుడ్డు’ హోర్డింగులు - మళ్లీ మొదలుపెట్టిన కాంగ్రెస్!
Telangana News: గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేసి జనాల్లోకి వెళ్లింది. తాజాగా కేంద్రం ఏ నిధులు కేటాయించలేదని నిరసన తెలుపుతూ మళ్లీ అదే ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తోంది.
Hoardings in Hyderabad: మళ్లీ తెలంగాణలో గాడిద గుడ్డు పోస్టర్లు వెలిశాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మళ్లీ అదే రకం ప్రచారాన్ని మొదలుపెట్టింది. మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్ లో తెలంగాణకు మోదీ సర్కార్ ఏమి ఇవ్వలేదని ఫైర్ అయింది. తెలంగాణ నుండి 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే.. రాష్ట్రానికి మోదీ సర్కార్ గాడిద గుడ్డు ఇచ్చిందని పోస్టర్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు బస్టాండ్లకు హోర్డింగ్ లకు ఈ గాడిద గుడ్డు పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి.
#Telangana #Congress is back with the Donkey Egg campaign pointing out that in #Budget2024 the state has got this, hitting out at the #BJP these hoardings are being put up in #Hyderabad @NewsMeter_In @NewsmeterTelugu pic.twitter.com/fKXCgQRVPp
— Kaniza Garari (@KanizaGarari) July 24, 2024
తెలంగాణకు ఇచ్చింది రూపాయికి రూ.0.43 పైసలే..
దీనిపై ఇప్పటికే చర్చ మెుదలైంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణకు నిధుల కేటాయింపులో బీజేపీ తీరుపై అసెంబ్లీ వేదికగా తీవ్రమైన విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాము. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిసా.. 18సార్లు కేంద్ర మంత్రులను కలిశాం. తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.
తెలంగాణ కేంద్రానికి ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బిహార్ కు రూ.7.26 పైసలు కేంద్రం ఇచ్చింది. తెలంగాణ నుంచి రూ.3 లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే. మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి ఉంది’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.