Tanuku SI: 'ఆ ఇద్దరు ఇబ్బంది పెట్టారు, భార్య పిల్లలను తలుచుకుంటే బాధేస్తోంది' - తణుకు ఎస్సై ఫోన్ కాల్ వైరల్
Andhra News: ప.గో జిల్లా తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు ఆయన తన సహచరుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఆడియో కాల్ వైరల్‌గా మారింది.

Tanuku SI Phone Call Viral: పశ్చిమగోదావరి జిల్లా తణుకు (Tanuku) గ్రామీణ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి (ఏజీఎస్ మూర్తి) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడక ముందు అదే శాఖలో పని చేస్తోన్న తన సహచరుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఆడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. 'ఏ మాత్రం సంబంధం లేని విషయంలో నన్నుఇరికించారు. వారిద్దరూ నన్ను కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. విజ్జిని, పిల్లలను తలుచుకుంటే బాధేస్తోంది.' అంటూ ఎస్సై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సహచరుడితో ఏమన్నారంటే..?
'నాకు రేంజ్‌కి రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది. నువ్వేం చెప్పినా ఎంత ఓదార్చినా నా చేతుల్లో ఏమీ లేదు. నన్ను మోసం చేసిన ఆ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. వీఆర్ భీమవరంలోనే కదా అని ఓపిక పట్టాను. ఇక నావల్ల కాదు. నా మనసేమీ బాగాలేదు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దర్నీ ఎంతో మొత్తుకున్నా. వారు నీ జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు. భార్య పిల్లలను తలుచుకుంటే బాధేస్తోంది. మనమందరం సంతోషంగా ఉంటామని అనుకున్నా. కృష్ణా జిల్లాకు పంపిస్తారు. ఒక రోజు కూడా నేను అక్కడ ఉండలేను. నేను వెళ్లలేను. నా వల్ల కావడం లేదు.' అంటూ ఏడుస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి సహచరుడు స్పందిస్తూ ఎస్సైకు ధైర్యం చెప్పేందుకు యత్నించారు. 'నువ్వు కంగారు పడి, పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. పాజిటివ్‌గా ఆలోచించు. ప్రస్తుతం నీకు మైండ్ సెట్ బాగాలేదు. నువ్వు లేకపోతే నీ భార్యాపిల్లలను ఎవరు చూస్తారు. నువ్వు చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా.?. వీఆర్‌లో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. నీ భార్యా పిల్లల గురించి ఆలోచించు. ఆ అమ్మాయికి ముందు వెనుకా, పుట్టింటికెళ్లి ఏడవడానికి కూడా ఎవరూ లేరు. నువ్వు చూసుకోవడం వేరు. మీ అన్నయ్య వాళ్లు, ఇతరులు చూడడం వేరు. ప్రాణం తీసుకునేంత ఇబ్బందేం లేదు. సరెండర్ చేశారు. వెళ్లి అడుగు. అవసరమైతే నేను కూడా వస్తాను. ప.గో జిల్లాలో నీకు అన్యాయం జరిగింది. జిల్లా మారితే మార్పు వస్తుందేమో ఆలోచించు. నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా.?. నిన్ను నమ్ముకున్న వారి కోసం ఆలోచించు. 5 నిమిషాల్లోనే ఏ సమస్యకూ పరిష్కారం దొరకదు. ఆలోచించు.' అంటూ సహచరుడు ఎస్సైకు నచ్చచెప్పారు.
ఎస్పీ ఏమన్నారంటే..?
అయితే, ఈ ఆడియో కాల్ వైరల్ ఘటనపై ఎస్పీ స్పందించారు. దీనిపై విచారణ చేస్తామని.. పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది..
తణుకు రూరల్ పీఎస్‌లో విధులు నిర్వహించిన ఎస్సై మూర్తి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గేదెల అపహరణ కేసులో పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం వీఆర్‌లో ఉన్న ఆయన.. ఆ రోజు ఉదయం సీఎం బందోబస్తుకు వెళ్లే క్రమంలో పీఎస్‌కు వచ్చారు. ఆ తర్వాత బాత్ రూంలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Also Read: Chandrababu: బడ్జెట్ లో ఏపీ ప్రస్తావన రాలేదన్న విమర్శలపై ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు క్లారిటీ





















