Rangareddy News: చాక్లెట్లు తిన్న విద్యార్థుల్లో వింత ప్రవర్తన- రంగారెడ్డి జిల్లాలో కలకలం
Rangareddy Crime News:రంగారెడ్డి జిల్లాలో చాక్లెట్లు తిన్న విద్యార్థులు వింత వింతగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ముందుగా ఫ్రీగా ఇచ్చిన దుకాణందారులు తర్వాత ధర పెంచుతూ వెళ్లారు
Rangareddy Crime News: రంగారెడ్డి జిల్లాలో చాక్లెట్లు తిన్న విద్యార్థులు వింత వింతగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ముందుగా ఫ్రీగా ఇచ్చిన దుకాణందారులు తర్వాత ధర పెంచుతూ వెళ్లారు. వీటిని తిని క్లాస్‌లకు వచ్చిన విద్యార్థులు చాలా విచిత్రంగా ప్రవరిస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వం పాఠశాలలో సంచలనం సృష్టించే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో విద్యార్థులు కొత్తగా ప్రవర్తిస్తుండటంతో ఉపాధ్యాయులు కంగారు పెడ్డారు. ముందు ఒకరిద్దరు అనుకున్నారు. తర్వాత ఆ సంఖ్య పెరుగుతుండటంతో అనుమానం వచ్చింది.
విద్యార్థుల వింత ప్రవర్తనపై ఆరా తీసిన ఉపాధ్యాయులకు షాకింగ్ విషయం తెలిసింది. స్కూల్‌కు సమీపంలో దుకాణాల్లో చాక్లెట్లే దీనికి కారణమని గ్రహించారు. విద్యార్థులను నిలదీయడంతో అసలు విషయం చెప్పారు. పదే పదే ఆ చాక్లెట్లు తినాలనిపిస్తోందని అన్నారు.
మొదట్లో దుకాణందారులు చాక్లెట్లను ఫ్రీగా ఇచ్చే వాళ్లు. తర్వాత తర్వాత వాటికి ధర ఫిక్స్ చేశారు. మరికొన్ని రోజులకు ఆ రేట్ పెంచుతూ పోయారు. ఇలా ప్రస్తుతం ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది తెలుసుకున్న ఉపాధ్యాయులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఏదో జరుగుతోందని గ్రహించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మున్సిపల్ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి పాన్ డబ్బాలపై దాడులు చేశారు. చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ చాక్లెట్లలో ఏముందో తెలియదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వాటిని తిన్న విద్యార్థులు మాత్రం వింతగా ప్రవరిస్తున్నారని అంటున్నారు. పోలీసులు కూడా దీనిపై నోరు మెదపడం లేదు. అందులో ఏముందో చెప్పడం లేదు. విచారణ జరుగుతోందని త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.