Vizag Crime News: వివాహేతర బంధం పెట్టుకుని డబ్బు కోసం చంపేశాడు - విశాఖ దంపతుల హత్యలో నిందితుడు అరెస్ట్
Murder: విశాఖలో దంపతుల్ని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు అప్పుగా ఇచ్చిన మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని..తిరిగి ఇవ్వాలని అడిగే సరికి హత్య చేశాడు.

Visakhapatnam couple Murder Case: విశాఖలో నేవెల్ డాక్‌యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు, ఆయన భార్య లక్ష్మిని చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ప్రసన్నకుమార్ మిశ్రా. కొంత కాలంగా యోగేంద్ర బాబు, లక్ష్మి దంపతులతో ఆయనకు పరిచయం ఉంది. వారు ఐదులక్షల రూపాయలు అప్పు కూడా ఇచ్చారు. లక్ష్మితో వివాహేతర బంధాన్ని మిశ్రా ఏర్పరుచుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో వారిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ పని మీద హైదరాబాద్ వెళ్లిన వారు.. గ్లోరియా స్కూల్ అడ్మిన్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విసాఖ వచ్చారు.
గ్రామదేవత ఉత్సవాల శబ్దాల్లో కలసిపోయిన చావుకేకలు
అప్పుడే మిశ్రా కూడా వచ్చాడు. రాజీవ్ నగర్ లో గ్రామదేవత పండుగ జరుగుతూండటంతో శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి.ఆ సమయంలో అరుపులు బయటకు వినిపించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దర్నీ దారుణంగా హత్య చేసిన మిశ్రా తన స్వస్థలం అయిన ఒరిస్సాకు వెళ్లిపోయాడు. ఈ కేసును పోలీసులు చాలెంజింగ్ గా తీసుకున్నారు. 8 బృందాలుగా దర్యాప్తు చేశారు. స్వయంగా విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి కేసును చేధించేందుకు రంగంలోకి దిగారు. 40 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు యోగేంద్ర, లక్ష్మి. వీరి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. వీరిద్దరే విశాఖలో ఉంటున్నారు.
కేసును స్వయంగా ఫాలో అప్ చేసిన విశాఖ సీపీ బాగ్చీ
క్లూస్ టీం ద్వారా ఆధారాల సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ని రంగంలోకి దించారు. పాదముద్రలు, ఫింగర్ ప్రింట్లు తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. మృతుల ఫోన్ రికార్డులు, చివరిగా ఎవరితో మాట్లాడారనే విషయాలను తెలుసుకున్నారు. చివరికి అన్ని దారులు ప్రసన్నకుమార్ మిశ్రా వైపు వెళ్లాయి. అతనిపై నిఘా పెడితే హత్య చేసింది అతనేనని తెలింది. అందరూ గ్రామదేవత పండుగ హడావుడిలో ఉండగా అదను చూసుకుని హత్యకు పాల్పడ్డాడు. లక్ష్మి ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని వెళ్లిపోయాడు.దాన్ని ఒరిస్సాలో తాకట్టు పెట్టి నాలుగున్నర లక్షలు తీసుకున్నాడు.
దుబాయ్‌లో ఐదేళ్లు జైలు శిక్షలో గడిపి వచ్చిన హంతకుడు మిశ్రా
ప్రసన్నకుమార్ మిశ్రా ను అరెస్టు చేసిన తర్వాత సంచలన విషయాలు తెలిశాయి. ఆయన అంతర్జాతీయ నేరస్తుడని గుర్తించారు. ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లి అక్కడ ఓ బంగారు దుకాణంలో దొంగతనం చేసాడు. దాంతో అక్కడ ఐదు ఏళ్లు శిక్ష పడింది. జైల్లో ఐదేళ్లు గడపిన తర్వాత ఆ దేశం నుంచి గెంటేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేస్తూ వచ్చాడు. చివరికి ఆ నేరగాడి వలలో యోగేంద్రబాబు, లక్ష్మి దంపతులు చిక్కారు.



















