Palnadu Crime News: సినిమా తలపించే ఘటన, పల్నాడు క్రైం కథలో ఎన్నో మలుపులు!
Palnadu Crime News: పల్నాడు జిల్లాలో థ్రిల్లర్ సినిమాను తలపించే ఘటన జరిగింది. ఓ హత్య కేసు పలు మలుపులు తిరుగుతూ ఆఖరికి నిందితులను పట్టించింది.
Palnadu Crime News: సినిమా కథలు నిజ జీవితాల నుంచే వస్తాయి. వారి జీవితంలోనో లేదా మరొకరి జీవితంలో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది కథలను సిద్ధం చేస్తుంటారు కొందరు దర్శకులు, రచయితలు. అలా వచ్చిందే దృశ్యం సినిమా. ఒక హత్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. పూర్తిగా ట్విస్టులతో ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ అలాంటి సంఘటన పల్నాడులో సంచలనం రేకెత్తిస్తోంది.
పల్నాడు జిల్లాలో నిందితులు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. తర్వాత ఒక చోట పూడ్చి పెట్టారు. చనిపోయిన వ్యక్తి గురించి వెతకడం మొదలు పెట్టాడు అతని సోదరుడు. తన సోదరుడిని కిడ్నాప్ చేసిన వారి గురించి తెలుసుకున్నాడు. వారి నుంచి నిజం రాబట్టే క్రమంలో ఒక వ్యక్తిని హత మార్చాడు. నిందితుల్లో ఒకరి మృతితో మిగతా వాళ్లలో భయం మొదలైంది. తమనూ చంపుతాడని వణికిపోయారు. తమ వరకూ రాక ముందే అతడిని చంపేయాలని పథకం పన్నారు. అతనిపై దాడి చేసినా తప్పించుకున్నాడు. పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా వాళ్లు నిందితులను అరెస్టు చేసి, మొదటి వ్యక్తిని కిడ్నాప్ చేసి ఎలా హతమార్చింది పూసగుచ్చినట్లు చెప్పారు.
పల్నాడు జిల్లాలో థ్రిల్లర్ కథ
థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలుకి చెందిన జంగం చంటి గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. అతని అన్న బాజీ తన తమ్ముడు కనిపించకుండా పోయాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తన తమ్ముడి గురించి బాజీ స్వయంగా వెతకడం మొదలు పెట్టాడు. అలా తన తమ్ముని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. కొందరిపై అనుమానం వచ్చింది.
నరసరావుపేట మండలం కేసానుపల్లికి చెందిన రావిపాటి వెంకన్న, దాచేపల్లికి చెందిన నాగూర్ అలియాస్ బిల్లాతో కలిసి చంటి దొంగతనాలే చేసేవాడు. దొంగ బంగారాన్ని మార్పిడి చేసుకునేందుకు నరసరావుపేటలోని ఓ నగల దుకాణం ఉద్యోగి, జొన్నలగడ్డకు చెందిన సిలివేరు రామాంజనేయులు సాయం తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో బాజీ ఈ ఏడాది ఏప్రిల్ 22న రామాంజనేయులను కిడ్పాన్ చేసి అతని నుంచి నిజం రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రామాంజనేయులను బాజీ చంపాడు.
కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి హత్య
తమను బాజీ వెతుకుతున్నాడని ఈ గ్యాంగ్ పసిగట్టింది. ఇంతలో గ్యాంగ్‌లో రామాంజనేయులు చనిపోవడంతో వారిలో టెన్షన్ మొదలైంది. రామాంజనేయులను చంపిన బాజీ తమనూ చంపుతాడన్న భయం మిగతా నిందితులకు పట్టుకుంది. అతను తమను ఎటాక్ చేయకముందే బాజీ చంపాలని ప్లాన్ వేశారు. రామాంజనేయులను చంపిన కేసులో పోలీస్ స్టేషన్ కు వచ్చి తిరిగి వెళ్తున్న బాజీపై దాడి చేశారు. ఈ దాడిలో బాజీ గాయాలతో తప్పించుకుని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసుల ఎంట్రీతో రావిపాటి వెంకన్న, బిల్లాతోపాటు మరికొందరు చిక్కారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో దొంగలించిన బంగారాన్ని డబ్బు రూపంలోకి మార్చే బాధ్యతను వాళ్లంతా కలిసి చంటికి అప్పగించారు. తర్వాత డబ్బుల విషయంలో వారికీ చంటికీ గొడవ మొదలైంది. అలా చంటిని కిడ్నాప్ చేసి విజయవాడంలోని లాడ్జీలో చిత్రహింసలు పెట్టి చంపారు. తర్వాత మృతదేహాన్ని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్ గేట్ సమీపంలో పూడ్చి పెట్టారు.
మొలతాడు, తాయత్తుతో చంటిగా గుర్తింపు..
నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు బొమ్ములూరులో మృతదేహం కోసం తవ్వకాలు జరిపారు. కుళ్లిన స్థితిలో మృతదేహం, మొలతాడు, తాయత్తు కనిపించగా.. అవి చంటివేనని కుటుంబసభ్యులు గుర్తించారు. ఈ కేసులో రావిపాటి వెంకన్న, బిల్లాతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.