NTR District News : తల్లిదండ్రులకు భారం కాకూడదని విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
NTR District News : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు చూసి, తాను భారం కాకూడదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
NTR District News : చదువుల తల్లి అర్థాంతరంగా తన జీవితాన్ని చాలించింది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చూసి తాను భారం కాకూడదని ప్రాణాలు విడిచింది. బాలిక రాసిన సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ విషాద ఘటన జరిగింది. స్థానిక రైతుపేటలో జాస్తి హరిత వర్షిణి అనే విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వర్షిణి ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్‌రావు దిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా సమయంలో కుమార్తె చదువు కోసం విజయవాడలోని ఎస్బీఐలో క్రెడిట్ కార్డుపై మూడున్నర లక్షల రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించాలని ఇటీవల బ్యాంకు రికవరీ ఏజెంట్లు ప్రభాకర్ రావు ఇంటికి వచ్చి ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఆందోళనతో హరిత ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా, బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదివించే స్థోమత లేదని
"ఇప్పుడున్న పరిస్థితులలో ఇళ్లు గడవడమే కష్టంగా ఉంది. నాకు, చెల్లికి చదువుల కోసం ఫీజ్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని హరిత సుసైడ్ నోట్ లో రాసింది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త అని, చెల్లిని బాగా చదివించాలని కోరింది. చెల్లిని బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోమని సూచించింది. ఇప్పుడున్న పరిస్థితుల మధ్య తల్లికి భారం అవ్వకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. ఎవరైనా తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానని అడిగితే ఎంసెట్ ర్యాంకు రాలేదని అందుకే చనిపోయిందని చెప్పాలని తల్లికి సూచించింది. తనను చదివించే స్థితిలో లేరని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని హరిత లేఖలో పేర్కొంది.
రికవరీ ఏజెంట్లు పరారీ!
తన కూతురు ఆత్మహత్యకు బ్యాంకు ఏజెంట్ల వేధింపు కారణమని హరిత తల్లి ఆరోపిస్తున్నారు. నందిగామలో బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులతో విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హరిత తండ్రి తీసుకున్న బ్యాంకు అప్పు తీర్చాలని రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి బెదిరించారని తెలుస్తోంది. కూతుళ్ల విషయంలో అవమానకరంగా మాట్లాడారని హరిత తల్లి అంటున్నారు. హరిత ఆత్మహత్యతో బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఏజెంట్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Sai Priya Episode : సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్- బతకాలని ఉందంటూ పేరెంట్స్‌కు మెసేజ్