Nizamabad News: నేనెందుకు ఎఫ్ఐఆర్ చేస్తా- అమ్మాయి బంధువులకు ఏం సంబంధం? శ్రీకాంత్ కేసులో పోలీసుల ఆడియో వైరల్!
Nizamabad News: 3 నెలల క్రితం అదృశ్యమై పది రోజుల క్రితం అస్తిపంజరంగా దొరికిన శ్రీకాంత్ డెత్ మిస్టరీ కేసును పోలీసులు ఇప్పటికీ ఛేదించలేకపోయారు.
Nizamabad News: నిజామాబాద్ జిల్లా బోధన్ లో మూడు నెలల క్రితం ఓ యువకుడు అదృశ్యం అయ్యాడు. అయితే ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పి కేసు నమోదు చేసుకొమ్మని కోరగా.. వారు స్పందించలేదు. దీంతో తల్లిదండ్రులు కూడా అలాగే ఉండిపోయారు. కానీ 10 రోజుల క్రితం ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో ఓ అస్తి పంజరం లభ్యం అయింది. అయితే సదరు యువకుడి బ్యాగు అక్కడే ఉండడంతో చనిపోయిందని అతడే అని నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారే తప్ప ఇప్పటికీ అతడి డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించలేకపోయారు. అయితే ఏసీపీ నిర్లక్ష్యమే ఇందుకు కారణం అంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
నిజామాబాద్ జిల్లా బోధన్ లో యువకుడి మృతి మిస్టరీ కేసు ఇప్పటికీ వీడలేదు. మూడు నెలల క్రితం శ్రీకాంత్ అనే యువకుడు అదృశ్యం అయ్యాడు. అయితే శ్రీకాంత్ కి ఓ అమ్మాయితో ఎఫైర్ ఉంది. ఇద్దరివీ వేరువేరు కులాలు. గతంలో అమ్మాయి తరఫు బంధువులు... శ్రీకాంత్ ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శ్రీకాంత్ అదృశ్యం అయిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు తెలిపి ఫిర్యాదు కూడా చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
అంతా బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ వల్లే..
అతడు ఇంటి నుంచి కనిపించకుండా పోయిన 80వ రోజు పసుపు కుంట చెరువు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఉన్న ఓ అస్తి పంజరాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అదృశ్యం అవడంతో.. ఇతడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. అంతా కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా.. చెట్టుకు అస్తి పంజరం, ఆ పక్కనే శ్రీకాంత్ బ్యాగు ఉన్నాయి. దీంతో అది శ్రీకాంత్ మృతదేహమేనని కుటుంబ సభ్యులు, పోలీసులు భావించారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే తమ కుమారుడు అదృశ్యం అయ్యాడని చెప్పగానే పోలీసులు స్పందించి ఉంటే తమ కొడుకు ప్రాణాలతో ఉండేవాడని చెబుతున్నారు. ముఖ్యంగా బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కేసును ఛేదించాలని డిమాండ్ చేస్తున్నారు.
నాకెందుకు ఫోన్ చేసిర్రు - బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్
కేసు విచారణ ఎక్కడ వరకు వచ్చిందని శ్రీకాంత్ బంధువు ఒకరు బోధన్ ఏసీపీకి ఫోన్ చేయగా.. ఆయన ఇలా మాట్లాడారు. "మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసే ఎస్సైకే మీరు ఫోన్ చేయాలి. నాకేం సంబంధం లేదు. అయినా మనకేం మ్యాజిక్ పవర్స్ లేవు. చేయాల్సిందంతా చేసినం. మనం ఏం చేస్తం. వాడంతట వాడే బయటకు రావాలి. మీరేం పిటిషన్ ఇచ్చిర్రు. దేని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. నేనెందుకు చేస్త ఎఫ్ఐఆర్. అది ఏమీ చేయలేము. మీరు ఆరోపిస్తున్న అమ్మాయి తరఫు వాళ్లకు ఈ కేసుకు ఏం సంబంధం లేదు. వాళ్లదే తప్పని నువ్వు ఇప్పటికీ భావిస్తూ అది నీ మూర్ఖత్వం. అర్థమైందా. నువ్వోసారి వచ్చి నన్ను కలువు" అని అన్నారు.