Crime News: మిస్సింగ్ ఇంటర్ విద్యార్థిని కథ విషాదాంతం, కాలిన గాయాలతో డెడ్‌బాడీగా ! పోలీసులపై ఆరోపణలు
Missing student found dead with burns | మిస్సింగ్ ఇంటర్ విద్యార్థిని కథ విషాదాంతం అయింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.

అనంతపురం: అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని చనిపోయింది. కాలిన గాయాలతో మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పరిధిలోని మణిపాల్ స్కూల్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. నాలుగైదు రోజులు కిందట కూతురు కనిపించడం లేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నేడు విగతజీవిగా కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయిగా పోలీసులు గుర్తించారు. నగరంలోని రామకృష్ణ నగర్ కు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని తన్మయి వారం రోజుల క్రితం అదృశ్యం అయింది. నగర శివారులోని మణిపాల్ స్కూల్ వెనుక అనుమానాస్పదంగా తన్మయి మృతి చెందింది. తన్మయి ఎలా చనిపోయింది అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. తలపై బలమైన గాయాలు తగలడం వల్ల తన్మయి చనిపోయిందని, తరువాత పెట్రోల్ పోసి నిప్పు అంటించారని తెలిపారు. గుర్తుపట్టలేని విధంగా తన్మయి డెడ్ బాడీని గుర్తించారు.
అతడిపై అనుమానం ఉందని చెప్పినా..
విద్యార్థిని తన్మయి తండ్రి లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాల్ లిస్ట్ చెక్ చేసి ట్రేజ్ చేస్తామని పోలీసులు చెప్పారు. ఓ అబ్బాయి మీద అనుమానం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కాల్ లిస్ట్ వచ్చాక చూద్దామన్నారు. మాకు న్యాయం చేయాలి. ఇంటర్ ఫస్టియర్ పూర్తయింది. ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయితే సెకండియర్ చదవాలని’ చెప్పుకొచ్చారు.
వాడ్ని చంపేయండి సార్..
తన్మయి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెను నమ్మించి తీసుకెళ్లిన యువకుడ్ని చంపేయండి సార్. వాడు ఎంత మందిని ఇలా చేశాడో తెలియదు. ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు తీసుకోలేదు. ఆరు రోజులైంది. మా పాపకు న్యాయం చేయండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సమాచారం ఇచ్చినా నిందితుడ్ని వదిలేశారు
ఓ బంధువు మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి తన్మయి మిస్ అయింది. దాంతో మేం బస్టాండ్, రైల్వేస్టేషన్లో వెతికాం. బంధువులకు ఫోన్ చేస్తే రాలేదని చెప్పారు. బుధవారం రోజు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. కొన్ని నెంబర్లు ఇస్తే నరేష్ అని ఒకడ్ని పిలిపించారు. నాకు సంబంధం లేదని ఆ అబ్బాయి చెప్పాడు. కానీ అమ్మాయి వెళ్లిపోయిన రోజు రాత్రి 9 గంటలకు వాడికే ఫోన్ చేసిందని చెబితే పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదు. కాల్ లిస్ట్ ఇంకా రాలేదు. వచ్చాక దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. వాడ్ని వదిలిపెట్టొద్దు. కచ్చితంగా వాడి పనే అని చెప్పినా.. తనకు సంబంధం లేదని యువకుడు చెప్పడంతో వదిలేశారు. అదేరోజు ఆ అబ్బాయిని పట్టుకుని గట్టిగా అడిగింటే తేలిపోయేది. అమ్మాయి ఈరోజు ప్రాణాలతో ఉండేది. అనుమానం ఉందని వివరాలు, ఫోన్ నెంబర్ ఇచ్చినా.. కాల్ లిస్ట్ అంటూ కాలయాప చేశారు పోలీసులు. చివరకు డెడ్ బాడీగా మా అమ్మాయిని చూడాల్సి వచ్చిందని’ ఆవేదన వ్యక్తం చేశారు.






















