Vizianagaram Crime News:ఏపీ సచివాలయంలో ఉద్యోగాలు- ఫేస్‌బుక్‌లో ప్రకటన- హైదరాబాద్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్!
Vizianagaram Crime News:సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టు నమ్మితే ఎలాంటి విపరిణామాలు జరుగుతోయో చెప్పేందుకు ఇదో ఎగ్జాంపుల్. సచివాలయ ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాన్ని పోలీసులు ఛేదించారు.

Vizianagaram Crime News: కార్పొరేట్ కంపెనీలో రిక్రూట్‌మెంట్ జరుగుతోంది, ఆసక్తి ఉన్న వాళ్లు మెసేజ్ పెట్టండి అని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చూస్తున్నాం. ఈ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమిస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు నన్ను సంప్రదించండి. అని ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టాడు. అది నమ్మిన కొందరు యువకులు అతనికి వ్యక్తిగతంగా సంప్రదించారు. అదే వారి జీవితాన్ని మలుపు తిప్పింది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఉన్నాయని విజయనగరానికి చెందిన కె.సాయి వెంకట్ సుజిత్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు.అది వైరల్ అయింది. దాన్ని నమ్మిన ఉత్తరాంధ్రకు చెందిన కొందరు యువకులు సుజిత్‌ను సంప్రదించారు. వారి మధ్య చాలా రకాల చర్చలు జరిగాయి.
చాలా మంది ఇలా సంప్రదించినప్పటికీ కొందరు మధ్యలోనే డ్రాప్ అయ్యారు. మరికొందరు చివరి వరకు వచ్చారు. అలా వచ్చిన వారు ఏడుగురు. అతనితో ఉద్యోగాల కోసం మాట్లాడుకున్నారు. ఉద్యోగం అవుట్ సోర్సింగ్ అయినా చాలా మందికి చేతులు తడపాల్సి ఉంటుందని వారికి కలరింగ్ ఇచ్చాడు సుజిత్. మాటకారి అయిన సుజిత్ వారిన బోల్తాకొట్టించాడు. వారి వద్ద నుంచి 53 లక్షలు రూపాయలు తీసుకున్నాడు.
డబ్బులు తీసుకున్న సుజిత్ కొన్ని రోజుల తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు పంపించాడు. అవి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు అని తెలియక వారు నిజంగానే ఉద్యోగాలు వచ్చాయని సంబరపడిపోయారు. అంతేకాదు వారిని విజయవాడకు తీసుకొచ్చి ట్రైనింగ్ ఉంటుందని కూడా చెప్పాడు. వారిని నెలరోజుల పాటు ఓ ప్రాంతంలో ఉంచాడు. రోజులు గడిచాయి. ట్రైనింగ్ స్టార్ట్ కాకపోవడం, సచివాలయానికి తీసుకెళ్లకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. నిలదీశారు.
టెక్నికల్ సమస్య ఉందని ఇంటికి వెళ్లిపోమని చెప్పాడు సుజిత్. వారం పదిరోజుల్లో మళ్లీ కబురు పెడతామని కలరింగ్ ఇచ్చాడు. ఇంటికి వచ్చి చాలా కాలమైనా సుజిత్ నుంచి కబురూ లేదూ కాకరకాయా లేదు. దీంతో వారి అనుమానం మరింత ఎక్కువైంది. బాధితుల్లో ఒకరైన ఎస్.కోటకు చెందిన ఎస్.వినోద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అసల విషయం చెప్పాడు. తనకు వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్‌ను కూడా చూపించాడు.
అపాయింట్మెంట్ ఆర్డర్‌ను చూసిన పోలీసులు అది నకిలీదని తేల్చారు. వాళ్లంతా మోసపోయినట్టు చెప్పారు.వ వెంటనే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేపట్టారు. కేసు గురించి తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. ముఠాగా ఏర్పడి వీళ్లు ఈ దందా చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వారి వివరాలు కూడా తెలుసుకున్నారు.
ఈ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుజిత్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. మిత్రుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడాన్ని తెలుసుకున్న మిగతా నిందితులు పరామర్శించేందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు విజయనగరం రైల్వేస్టేషన్ సమీపంలో మాటు వేశారు. నిందితులు ట్రైన్ దిగ్గానే సీహెచ్ మహేష్, రూబిన్ కుమార్, జాన్, యాకూబ్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సుజిత్‌ను కోలుకోగానే అరెస్టు చేస్తామని చెప్పారు.
ఇప్పుడు చిక్కిన నిందితుల్లో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా... మరో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌వాసులు. వీళ్లంతా ఒక ముఠాగా ఏర్పడి ఉద్యోగాలు, ఇతర దందాల పేరుతో అమాయకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడినట్టు కూడా నిందితులు అంగీకరించారు. నమ్మిన డబ్బులు ఇచ్చే వారిని మోసం చేసి హైదరాబాద్‌లో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఐడీ కార్డులు తయారు చేస్తున్నట్టు వెల్లడించారు.





















